తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 18వ తేదీన ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తు ఇప్పటికే దాదాపుగా పూర్తైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన విధివిధానాలకు అనుగుణంగా అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలను తయారు చేశారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కూడా ఆయా శాఖల అధికారులతో సమావేశమై ప్రతిపాదనలపై చర్చించారు. తుది కసరత్తు ఇంకా కొనసాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు ఖరారు కానున్నాయి. కరోనా, లాక్డౌన్ తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వార్షికపద్దు సిద్ధమవుతోంది. 2020-21 సంవత్సరానికి లక్షా 82వేల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
చివరి త్రైమాసికంలో గరిష్టంగా ఆదాయం
కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థికకార్యకలాపాలు మొదట్లో పూర్తిగా స్తంభించగా... ఆ తర్వాత క్రమేణా పుంజుకుంటూ వచ్చాయి. దీంతో ఆర్థిక సంవత్సరం మొదట్లో పూర్తిగా పడిపోయిన ప్రభుత్వ రాబడులు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి చివరి త్రైమాసికానికి గరిష్టానికి చేరుకున్నాయి. కరోనా తదనంతర పరిణామాలతో రాష్ట్రానికి రావాల్సిన రాబడి యాభై వేల కోట్ల వరకు తగ్గిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఆదాయంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గడంతో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా అప్పులపై ఆధారపడాల్సి వచ్చింది. బడ్జెట్లో కేవలం 33వేల కోట్ల రూపాయలు పేర్కొనగా... ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రుణాల మొత్తం 45వేల కోట్ల వరకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నెల వరకు రాష్ట్రానికి పన్నుల రాబడి 60వేల కోట్లు రాగా... మొత్తం రెవెన్యూ రాబడులు 75 వేల కోట్ల వరకు ఉన్నాయి. డిసెంబర్ నెలతో పాటు చివరి త్రైమాసికంలో గరిష్టంగా ఆదాయం వస్తోంది.
వాస్తవిక దృక్పథంతో..