చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పోటెత్తిన వరదలు- సామాన్య జనజీవనాన్ని ఛిద్రం చేశాయి. నీట మునిగిన ఇళ్లూ పొలాలు, కన్నీళ్లూ కట్టుబట్టలతో మిగిలిన బాధితులతో ఎక్కడికక్కడ దుర్భర దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. పదుల సంఖ్యలో అభాగ్యులు ప్రాణాలు పోగొట్టుకోగా- జల ఉద్ధృతిలో జాడ తెలియకుండా పోయిన వారెందరో ఇదమిత్థంగా అంతుచిక్కడం లేదు! మూడు వేల కోట్ల రూపాయల మేరకు పంటనష్టం సంభవించినట్లు అధికార యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. నాలుగు జిల్లాల్లోని 13వందలకు పైగా గ్రామాలు జలప్రళయంలో చిక్కుకున్నాయి. కనీవినీ ఎరగని స్థాయిలో విరుచుకుపడిన వరదల ధాటికి తిరుపతి చిగురుటాకులా వణికిపోగా- తిరుమల మెట్లదారి, ఘాట్‌రోడ్లు సైతం దెబ్బతిన్నాయి. ఎడతెరిపి లేని వానలతో ప్రకాశం జిల్లాలోని పలు మండలాలూ అతలాకుతలమయ్యాయి. బాధితులకు తక్షణ సాయం అందించడం ఎంత కీలకమో- ఆయా ప్రాంతాలు అంటువ్యాధుల కోరల్లో చిక్కుకోకుండా కాచుకోవడమూ అంతే ప్రధానం.
తిరుపతిలో ప్రమాద తీవ్రత అధికం కావడానికి జలవనరుల ఆక్రమణలూ కారణం కావడమే ఆందోళనకరం! చెరువులు, కుంటలు, నాలాల కబ్జాల మూలంగానే నిరుడు భాగ్యనగరాన్ని భారీ వరదలు ముంచెత్తాయని నీతిఆయోగ్ నివేదిక తూర్పారబట్టింది. ఆధునికతకు నోచుకోని మురుగునీటి పారుదల వ్యవస్థలతో పాటు ముందస్తు హెచ్చరికల పరంగా లోపాలు సైతం ప్రజావళికి పెనుశాపమవుతున్నట్లు ఆవేదన వ్యక్తంచేసింది. ఏపీ, తెలంగాణలతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ్ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గడచిన కొన్నేళ్లలో భారీ వరదలెన్నో సంభవించాయి. అభివృద్ధి ముసుగులో పర్యావరణానికి పొగపెడుతున్న మానవ దుశ్చేష్టలే అత్యధిక ఉత్పాతాలకు కారణభూతమవుతున్నాయి. వాటిని నివారించడంతో పాటు ఊహించని విధంగా విరుచుకుపడే విపత్తుల నిర్వహణకు సంబంధించి పటుతర ప్రణాళికల రూపకల్పన, అమలులో ప్రభుత్వాల అలక్ష్యమే భారతావనిని తరచూ శోకసంద్రంలో ముంచేస్తోంది!