కరోనా దేశంలోకి ప్రవేశించక ముందు నిత్యం 26 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతుండగా ప్రస్తుతం 21 కోట్లకు పడిపోయింది. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో వదంతులతో పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. నష్టాలపాలైన రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. కొంత కాలానికి కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి కోడిగుడ్లు, కోడి మాంసం తీసుకోవాలన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచనతో పౌల్ట్రీ ఉత్పత్తుల వినియోగం మళ్లీ పెరిగింది. గుడ్ల ధర పెరిగినా.. ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు.
పరిశ్రమ కోలుకోవాలంటే..
రుణాలపై వడ్డీ రాయితీ, ఏడాదిపాటు మారటోరియం, రాయితీపై మొక్కజొన్నలు అందించడం, గోదాముల్లోని నూకలు, గోధుమలను సరసమైన ధరకు అందించడం వంటి చర్యలు చేపట్టాలి. తద్వారా పరిశ్రమకు కాస్త ఉపశమనం లభిస్తుంది.
వినియోగం ఇలా..
నేషనల్ న్యూట్రిషనల్ కౌన్సిల్ ఏటా 180 గుడ్లు తినాలని సిఫార్సు చేయగా దేశంలో తలసరి వినియోగం 73గా ఉంది. మెట్రో నగరాల్లో తలసరి వినియోగం 100 గుడ్లు. ఉత్తరాది కంటే దక్షిణాదిలో వినియోగం ఎక్కువగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడులో 100-110 వరకు వినియోగిస్తున్నారు.
నిరుద్యోగ సమస్యకు పరిష్కారం
పౌల్ట్రీ పరిశ్రమ గ్రామీణ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతో పాటు ఆహార భద్రతకు దోహదపడుతోంది. మొక్కజొన్న, సోయా పంటలకు గిట్టుబాటు ధర కల్పనకు సహకరిస్తోంది. రవాణా రంగం కూడా పౌల్ట్రీపై ఆధారపడి ఉంది. కరోనాతో పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమ, రైతులకు ప్రోత్సాహం అందించాలి. ఇప్పుడున్న పరిస్థితులు కొనసాగితే పరిశ్రమ విస్తరణ తగ్గిపోయి ఉత్పత్తి తరుగుదలతో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల తరహాలో గుడ్డు ధర రూ.11కి పెరుగుతుంది. అప్పుడది అందుబాటులో లేక ప్రజల్లో పోషక విలువలు పడిపోయి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. గుడ్డు.. పేదవాడి ఆహారం. ఇది అందరికీ అందాలని నా ఆకాంక్ష.