ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రవాహం లాంటి ఆమె.. సంద్రమంత గంభీరంగా మారింది? - international women's day special story

నీ కోసమే చిన్ని మేమేం చెప్పినా.. అంటూ చిన్నతనం నుంచి తల్లిదండ్రులు కట్టడి చేస్తున్నా.. అలా చేస్తే అమ్మానాన్నకు చెడ్డపేరు వస్తుందని అన్నాదమ్ములు అడ్డుకున్నా.. కుటుంబం కోసం అనునిత్యం అహర్నిశలు కష్టపడుతున్నా తనకు దక్కాల్సిన గౌరవం, గుర్తింపు ఇవ్వకున్నా.. తన వాళ్లే కదా అని బాధను కడుపులోనే దాకుచునే ఆడవాళ్లు నిజంగా పిచ్చివాళ్లేనండోయ్.. ఆడవాళ్లను పిచ్చివాళ్లు చేసిందెవరు? తనవాళ్లకు ఏదైనా జరిగితే.. అరక్షణం ఆలోచించకుండా ఆకాశాన్నైనా నేలకు దించే మహిళ.. తన గురించి తానే మరిచిపోయేలా చేసిందెవరు? ఆడదంటే ఆదిపరాశక్తి.. స్త్రీ లేకపోతే సృష్టే లేదు. ఆమే ప్రపంచం.. ఆమెలోనే అనంతం అంటూ అక్షరాల్లోనే కానీ.. అమల్లో లేదెందుకు?

WOMENS DAY SPECIAL
WOMENS DAY SPECIAL

By

Published : Mar 8, 2021, 12:28 PM IST

అవును ఆడవాళ్లు పిచ్చివాళ్ళే.. నిజంగా పిచ్చివాళ్లేనండోయ్..! చిన్నతనంలో అమ్మానాన్నలు ఏదైనా చేస్తున్నప్పుడు వద్దంటే తనను కట్టడి చేస్తున్నారనుకుంటుంది.. ఓ వయసొచ్చాక అటు ఇటు తిరగొద్దని, అబ్బాయిలతో చనువుగా ఉండొద్దని చెప్పే తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఫ్యాషన్ వాళ్లని విసుక్కుంటుంది. చదువయ్యాక ఉద్యోగం చేయడానికి వెళ్దాం అనుకుంటే అక్కడ ఒంటరిగా ఎలా ఉంటుందని తన భద్రత కోసం ఆలోచించిన కన్నవాళ్లనే ఆడిపోసుకుంటుంది. తనకో తోడు ఉండాలని ఆలోచించి.. పెళ్లి చేద్దాం అనుకుంటే.. నాకప్పుడే పెళ్లి వద్దంటూ కన్నవాళ్లపైనే కన్నెర్ర చేస్తుంది. పెళ్లయ్యాక చిన్న చిన్న వాటికోసం అలుగుతూ బెట్టు చేస్తుంది. కొన్ని సార్లు తన కోపాన్ని పిల్లలపై చూపించడానికీ వెనకాడదు.

నీ కోసమే తల్లి మేమేం చేసినా అని తల్లిదండ్రులు అన్న మాట కోసం.. తన కలల్ని కడుపులోనే దాచుకుని ఇతరుల సంతోషం కోసం అను క్షణం ఆరాటపడే ఆడది నిజంగా పిచ్చిదే ! నిజమేనంటారా? అసలు వాళ్ల కోణంలో నుంచి ఒకసారి చూస్తే.. వారి మనసులోకి ఓసారి తొంగి చూస్తే.. వాళ్ల స్థానంలో ఉండి ఆలోచిస్తే..

ప్రేమ పేరుతో చిన్నతనంలో కట్టడి చేసిన తల్లిదండ్రులను.. తనకి నచ్చింది చేయనివ్వకపోవడం ప్రేమ ఎలా అవుతుందని అడగలేని ఆమె పిచ్చిదే.. తన అసంతృప్తిని కోపంలో చూపించే ఆ పసిపిల్ల నిజంగానే పిచ్చిదేనండోయ్!

అబ్బాయిలతో మాట్లాడొద్దు.. బయట తిరగొద్దు అన్నప్పుడు.. అమ్మానాన్నలకు నేనెంటో తెలీదా అని అనుకునే ఆమె పిచ్చిదే.. నాపై నమ్మకం లేదా అని తనలోనే కుమిలిపోయి ఆ బాధను అసహనం రూపంలో చూపించే ఆ అమ్మాయి నిజంగా పిచ్చిదేనండోయ్!

కష్టపడి చదివించిన తల్లిదండ్రులకు చేయూత నివ్వాలని జాబ్ చేద్దామనుకున్న ఆమె పిచ్చిదే.. పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందని భావించి ఆమె కన్న కలల్ని నెరవేర్చుకునే అవకాశం ఇవ్వకుండా పెళ్లి చేస్తే తలొంచి తాళి కట్టించుకున్న ఆ అమ్మాయి నిజంగా పిచ్చిదేనండోయ్!

కన్నవాళ్లెలాగు అర్థం చేసుకోలేదు కట్టుకున్న వాడైన తోడుగా నిలుస్తాడనుకున్న ఆ స్త్రీ పిచ్చిదే.. ఆడదంటే వంటిట్లోనే ఉండాలి.. పెళ్లైతే ఆశలన్నీ చంపుకుని బతకాలని అర్థం చేసుకొని... సర్దుకుపోతున్న ఆమె నిజంగా పిచ్చిదేనండోయ్!

పెళ్లికి ముందు గలగల గోదారి ప్రవాహంలా ఉండే ఆమె.. ఇప్పుడు సముద్రమంత గంభీరంగా మారితే.. ఆ మార్పు ఎందుకు వచ్చింది అని ఎవరైనా అడుగ్గుతారేమో అని ఆశ పడ్డ ఆమె నిజంగా పిచ్చిదే.. తనకేం కావాలో ఒకరైనా తెలుసుకుంటారేమో అని ఎదురుచూస్తున్న ఆడది నిజంగా పిచ్చిదేనండోయ్! తనంటూ ఉందని గుర్తించాలని, తను చేసే పనికి గౌరవమివ్వాలని కోరుకున్న ఆమె పిచ్చిదే.. చుట్టూ ఎంత మంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్న ఆడది నిజంగా పిచ్చిదేనండోయ్!. ఇంతకీ.. ఆమె అలా మారడానికి కారణమెవరు?

ప్రేమ పేరుతో చిన్న తనం నుంచే సంకెళ్లు వేస్తున్న తల్లిదండ్రులా? తల్లిదండ్రుల గౌరవం కాపాడాలని నిత్యం గుర్తుచేస్తూ.. అనుక్షణం అడ్డుకుంటున్న అన్నదమ్ములదా? స్త్రీ అంటే తన చెప్పుచేతల్లోనే ఉండాలి అని, తన ఆత్మ గౌరవానికి ప్రతి క్షణం భంగం కలిగిస్తున్న కట్టుకున్నవాడిదా? ఆడదంటే ఇలా ఉండాలి, ఇలానే మాట్లాడాలి, ఇలా నడవాలి, ఇలాగే నడుచుకోవాలి, ఈ బట్టలే వేసుకోవాలి, ఈ పనులు మాత్రమే చేయాలి అని తిరుగులేని శాసనం రాసిన ఈ సమాజం ఆలోచన విధానిదా?

మహిళలు ఎంత అభివృద్ధి చెందినా.. ఎన్ని రంగాల్లో తిరుగులేని చక్రం తిప్పినా.. ఎన్ని అవార్డులు గెలుచుకున్నా.. ఆమె ఆ స్థాయికి చేరాలంటే ఈ అడ్డంకులన్ని దాటుకుని రావాల్సిందే.. తన దారిలో వచ్చే ఈ రాళ్లతోనే ఓ మార్గాన్ని ఏర్పరుచుకుని తన కలల తీరం వైపు నడక సాగించాల్సిందే.. ఆమె తన గమ్యాన్ని చేరుకోవాలని.. అడ్డంకులన్నింటిని అవలీలగా దాటుకోవాలని.. వీలైతే అండగా నిలవాలని కోరుకుంటూ... అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..!

ABOUT THE AUTHOR

...view details