ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

amaravati : కర్షకులే కథానాయకులై.. అతివలే ఆదిపరాశక్తులై... అలుపెరుగని పోరాటం - అమరావతిపై హైకోర్టు తీర్పు

భూమి కోసం, భుక్తి కోసం చరిత్రలో అనేక పోరాటాలు జరిగాయి. కానీ.. భవిష్యత్‌ కోసం, అదీ ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని కోసం అవిశ్రాంతంగా పోరాడిన చరిత్ర అమరావతి రైతులది.! కర్షకులే కథానాయకులై.. అతివలే ఆదిపరాశక్తులై. వైకాపా మూడు ముక్కలాటను రోజుకో రూపంలో ఎండగట్టారు. ఎక్కడా తగ్గకుండా.. చివరకు న్యాయస్థానంలో నెగ్గారు.

Amaravati farmers
Amaravati farmers

By

Published : Mar 3, 2022, 10:48 PM IST

కర్షకులే కథానాయకులై.. అతివలే ఆదిపరాశక్తులై... అలుపెరుగని పోరాటం

రెండున్నరేళ్ల కాలపరీక్షలో.. ఫస్ట్‌క్లాస్‌లో పాసైన అమరావతి రైతుల ఆనందోత్సాహమిది..! మూడు ముక్కలాట మొదలైనప్పటి నుంచీ పండగలు, పబ్బాలకూ దూరంగా ఉన్న రైతు కుటుంబాలకు ఇదే అసలు సిసలు పండగ.! ఉద్యమ శిబిరాల్లోనూ.. అదే ఉద్వేగం, ఉత్సాహం కనిపించింది. ఇలాంటి క్షణాల కోసమే అమరావతి రైతులు, మహిళలు రోజులు లెక్కపెట్టుకున్నారు. తాతలు, తండ్రులు ఇచ్చిన భూములను రాజధానికి రాసిచ్చిన.. అమరావతి రైతులు.. తమ త్యాగం వృథా కావడానికి వీల్లేదంటూ.. ఉద్యమంలోకి దిగారు. వైకాపా మూడు ముక్కలాటకు వ్యతిరేకంగా కదంతొక్కారు. ఒకే మాటగా.. ఒకటే బాటగా.. ముందుకుసాగారు.

దేనికీ వెరవేలేదు. కేసులకు భయపడలేదు..

ఒకటా.. రెండా.. ఏకంగా 800 రోజులకుపైబడిన చరిత్ర అమరావతి ఉద్యమానిది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో.. దేనికీ వెరవేలేదు. కేసులకు భయపడలేదు.! పోలీస్‌ లాఠీలకు ఎదురొడ్డారు. అవమానాలు, అవహేళనలను తట్టుకున్నారు.! ప్రభుత్వం అణచివేతలకు.. ఎదురుతిరిగారు. బూతులు తిడితే భరించారు. శ్మశానం, ఎడారి అంటూ రెచ్చగొట్టినా ఓర్పుగా ఉన్నారు. సీఎం జగన్‌ అసెంబ్లీకి వెళ్లే ప్రతీసారీ పోలీసులు వలలు అడ్డుపెట్టి.. ఇళ్ల ముందు ఇనుప కంచెలు వేసినా.. వాటిని దాటుతూనే..ఉద్యమాన్ని ఒక్కో మెట్టూ ఎక్కించారు. అసెంబ్లీ ముట్టడి, జాతీయరహదారి దిగ్బంధం, దుర్గమ్మకు పొంగళ్లు.. కాగడాల ప్రదర్శనలు.. ఇలా అమరావతి ఉద్యమ బాణాన్ని ఒక్కోరూపంలో.. గురిపెట్టారు. కానీ ఏనాడూ లక్ష్యాన్ని విస్మరించలేదు. గోడకు కొట్టిన బంతిలా.. ప్రభుత్వ వేధింపులను భరిస్తూ.. అణచివేతలను సహిస్తూ.. మరింత బలంగా ఉద్యమించారు.

33 గ్రామాల గొంతుకల్ని ఏకతాటిపై..

33 గ్రామాల గొంతుకల్ని ఏకతాటిపై వినిపించిన ఉద్యమ చరిత్ర అమరావతిది. ఉద్యమాన్ని పార్టీలకు, కులాలకు అంటగట్టే ప్రయత్నం చేసినా.. ఆ విమర్శల మరక అంటకుండా.. ఒకే రాష‌‌్ట్రం ఒకే రాజధాని అనే పట్టాలపైనే ఉద్యమ బండి ఠీవీగా ముందుకు నడిచింది. రాజకీయఅభిమానాన్ని ఒక్క రైతు కూడా గడప దాటనివ్వలేదు. లోలోపల ఏ పార్టీపై అభిమానం ఉన్నా.. ఉద్యమ శిబిరంలో మాత్రం ఎక్కడా పొరపచ్చాల్లేకుండా.. చూసుకున్నారు. రైతు స్ఫూర్తిని చాటే ఆకుపచ్చజెండా కిందే పోరాటం సాగించారు. పార్టీల జెండాలు తాము మోయకుండా.. కలిసొచ్చే రాజకీయ పార్టీలూ అమరావతి అజెండాకు జైకొట్టేలా పోరాడారు. అందుకే ఇన్నిరోజులైనా ఉద్యమ నాయకుల మధ్యగానీ, రైతుల మధ్యగానీ, మహిళల మధ్యగానీ.. విభేదాలు అన్న మాటేలేదు. అమరావతి మీది, మాది, మనందరిదీ అన్న స్ఫూర్తే.. వారిని ఏకతాటిపై నడిపించింది.

న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా పాదయాత్ర
మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ఉపసంహరించుకున్ననాడే.. ఒకింత సంబరపడిన రైతులు.. ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెడతామని చెప్పడంతో.. ఉద్యమాన్ని విస్తరించారు.33 గ్రామాల్లో.. మార్మోగిన ఉద్యమ నినాదాన్ని పొలిమేరలు దాటించారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా పాదయాత్ర చేసి.. పోరాట పటిమ చాటారు. కాళ్లకు బొబ్బలెక్కినా, భోజనాలు చేయనీయకుండా అధికార పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించినా,.. రాత్రిళ్లు బస చేయనీయకుండా బెదిరించినా.. వెనక్కి తగ్గలేదు. న్యాయం చెప్పే న్యాయస్థానం నుంచి ధర్మాన్ని కాపాడే దేవస్థానం వరకూ పాదయాత్ర చేశారు. అందుకే పాదయాత్ర పొడవునా పల్లెలు హారతులుపట్టాయి.

ఆకాశమంత ఓర్పు.. భూదేవంత సహనం

అమరావతి ఉద్యమ ఆకాంక్షను ఎన్నిరూపాల్లో చాటినా.. ఎప్పటికప్పుడు ఉద్యమానికి ఊపిరిలూదిందిమాత్రం మహిళలే. ప్రభుత్వం అణచివేసే ప్రతీ సందర్భంలోనూ.. అతివలే ఆదిపరాశక్తుల్లా పరాక్రమం చూపారు. లాఠీలతో కొడితే ఆకాశమంత ఓర్పు జుట్టుపట్టి ఈడ్చుకెళ్తే భూదేవంత సహనం ప్రదర్శించారు. కానీ పెయిడ్‌ ఆర్టిస్టులంటే సహించలేదు. ఇల్లు, పొలమే లోకంగా బతికిన మహిళలు ఉద్యమ శిబిరాల్లో చేరారు. రోజువారీ పనులు చక్కబెట్టుకుంటూనే.. నోరుపారేసుకున్న నేతల నోళ్లకు ఎదురుప్రశ్నలతో తాళం వేశారు.

చందాలు వేసుకుని.. కోర్టు ఖర్చులు

అమరావతి ఉద్యమ కత్తికి రెండువైపులా పదునుపెట్టారు రైతులు ! ఓ వైపు క్షేత్రస్థాయి ఉద్యమ వేడి రగిలిస్తూనే..మరోవైపు మూడుముక్కలాటకు వ్యతిరేకంగా కోర్టుమెట్లెక్కారు. అమరావతి నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చినట్లే..రైతులంతా చందాలు వేసుకుని.. కోర్టు ఖర్చులు భరించారు. తమ పోరాటం ఫలించిందంటూ... న్యాయ దేవతకు పాలాభిషేకాలు చేశారు.

ఇదీ చదవండి:High Court Verdict on Amaravati: సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details