చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం గత ఏడాది నుంచి ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని 30.16 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. అన్ని కేంద్రాలకు కలిపి నెలకు 1.13 కోట్ల లీటర్ల పాలు సరఫరా చేస్తున్నారు. దీనికోసం కేఎంఎఫ్ (కర్ణాటక మిల్క్ ఫెడరేషన్)తో ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది.
లబ్ధిదారులకు అందాల్సిన పాల ప్యాకెట్లు పలుచోట్ల బహిరంగ మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. పాల కేంద్రాలకు రవాణా చేసేవారు,లబ్ధిదారులకు అందజేయాల్సిన సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి దారి మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ఇలాంటి ఘటనలు చాల వెలుగుచూస్తున్నాయి. సరఫరా వ్యవస్థను ఆన్‌లైన్‌లోకి తెచ్చేందుకు ఏపీ డెయిరీ ఎం.డి. బాబు ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను అభివృద్ధి చేయించారు.
ఈ వెబ్‌సైట్ మొబైల్‌లో పనిచేసేలా తీర్చిదిద్దారు. గత మూడు వారాల నుంచి కొత్త ఆన్‌లైన్ విధానం అమలవుతోంది. పాల ప్యాకెట్లు ఇండెంట్ నుంచి లబ్ధిదారుకు చేరే వరకు అన్ని స్థాయిల్లో వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాని వివిధ సాంకేతిక సమస్యలు రావడం వల్ల పాల సరఫరా ఆలస్యం అవుతోంది. సాధారణంగా 55 లక్షల లీటర్ల పాలు అంగన్‌వాడీలకు చేరాల్సిన సమయంలో కేవలం 10 లక్షల లీటర్లు మాత్రమే చేరుతున్నాయి.