పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతున్నప్పటికీ.. రాజకీయపక్షాల పాత్రను పూర్తిగా విస్మరించలేం. నేతల కనుసన్నల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయనేది నిష్ఠూరసత్యం. వర్గవైషమ్యాలు, భావోద్వేగాలు కాస్త ఎక్కువుండే పల్నాటి పల్లెలు.. ఎన్నికలంటే మరింత సున్నితంగా మారుతాయి. సార్వత్రిక ఎన్నికలు చూసినా.. గతంలో మధ్యలోనే ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు చూసినా ఇదే పరిస్థితి.
తాజాగా పంచాయతీ ఎన్నికలపై అందరిదృష్టి పడింది. పంచాయతీ ఎన్నికల రెండోదశలో నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల పరిధితోపాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలాన్ని కలుపుకుంటే మొత్తం 236 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో దశలో మాచర్ల, గురజాల నియోజవర్గాల్లోని 9 మండలాల పరిధిలో 134 చోట్ల ఎన్నికలు జరిపేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. 13,17 తేదీల్లో పల్నాడులో రెండు విడతలుగా జరిగే ఎన్నికల కంటే.. ఈసారి నామినేషన్ల దాఖలు సమయం నుంచే ఉత్కంత ప్రారంభమైంది. అత్యధిక పల్లెల్లో... ఏకగ్రీవాలే లక్ష్యంగా నేతలు పావులు కదుపుతున్నారు. పలుకుబడి ఉన్న నేతలు మరింతగా ముందుకెళ్లి సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రచారానికి వెనుకంజ..
సాధారణ ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్షపార్టీ శ్రేణులు కకావికలం కావడంతో కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు అసలు పోటీ చేయడానికే వెనుకంజ వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మాచర్ల నియోజకవర్గంలో ప్రత్యర్థి పక్షం నుంచి అభ్యర్థులు పోటీకి దిగడానికే వెనుకడుగు వేస్తున్నారు. అభ్యర్థులపై తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్నారని.. గతంలో చేసిన పనులకు బిల్లులు ఆపేస్తామని బెదిరిస్తున్నారని ప్రత్యర్థి పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. బైండోవరు కేసుల పేరుతో బెదిరిస్తున్నారని కొందరు ఆశావాహ అభ్యర్థులు వాపోతున్నారు.