ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైళ్లలో వచ్చేవారికి కరోనా పరీక్షలపై సందిగ్ధత!

ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో రాష్ట్రానికి వచ్చేవారికి కరోనా పరీక్షలు చేయాలా...? వద్దా..? అనే విషయం పై వైద్యారోగ్య శాఖ మల్లగుల్లాలు పడుతోంది.

medical department Ambiguity on Corona tests for those arriving on trains
రైళ్లలో వచ్చేవారికి కరోనా పరీక్షలపై సందిగ్ధత

By

Published : May 31, 2020, 9:46 AM IST

వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరపాలా..? వద్దా..? అన్నదానిపై వైద్యారోగ్య శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ప్రత్యేక బస్సులు, రైళ్ల ద్వారా రాష్ట్రంలోకి వచ్చిన వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి పరీక్షలు చేస్తున్నారు. ఫలితాన్ని బట్టి హోం కార్వంటైన్‌/ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

సోమవారం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొన్ని రైళ్లు రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల గుండా ప్రయాణిస్తాయి. ముఖ్యంగా సీఎస్టీ ముంబయి నుంచి రోజూ బెంగళూరు, దిల్లీ-విశాఖ, హావ్‌డా నుంచి యశ్వంతపుర్‌, ఇతర రైళ్లు రాష్ట్రం మీదుగా నడవనున్నాయి. ఈ రైళ్ల ద్వారా వచ్చేవారిని క్వారంటైన్‌ కేంద్రాలకు పంపించి, పరీక్షలు చేయకుంటే వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక బస్సులు, రైళ్లలో వచ్చే వలసకార్మికులు, విమానాల్లో వచ్చేవారికి పరీక్షలు జరుపుతున్నందున వ్యాప్తి కట్టడిలో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో అధిక పాజిటివ్‌ కేసులతో సతమతమవుతున్న ముంబయి లాంటి నగరాల నుంచి వచ్చేవారికి పరీక్షలు చేయకుంటే పరిస్థితులు చేతులు దాటే ప్రమాదముందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.

అధికారుల్లో ఆందోళన..

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత హైదరాబాద్‌, ఇతరచోట్ల నుంచి 11 సరిహద్దుల గుండా వేల మంది వాహనాల్లో రాష్ట్రంలోకి ప్రవేశించారు. వీరికి పరీక్షలు జరపలేదు. ‘స్పందన’ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోకుండానే రాష్ట్రంలోకి వచ్చారు. తద్వారా వైరస్‌ వ్యాప్తిపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సరిహద్దుల వద్ద 24 గంటలపాటు అధికారులను నియమించి రాష్ట్రంలోకి వచ్చేవారికి పరీక్షల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ.. వైద్యారోగ్యశాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. వివరాలు అందుబాటులో ఉన్నంతవరకు వారి ఆరోగ్య స్థితిని పరిశీలించాలని సూచించింది.

'ర్యాండమ్‌’గా పరీక్షలు జరపాలి

రోజూ జిల్లాల్లో కనీసం 300 మందికి ర్యాండమ్‌ పరీక్షలు జరపాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ముఖ్యంగా 60 ఏళ్లు దాటినవారికి, ఆరోగ్య కార్యకర్తలు, పరిశ్రమలు, మార్కెట్‌ యార్డులు, నిర్మాణరంగంలో పనిచేసేవారికి, వలస కార్మికులు, జ్వరాలు ఉన్నట్లు గుర్తించినవారికి ర్యాండమ్‌ విధానంలో పరీక్షలు జరపాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం సూచించింది.

ఇవీ చదవండి:హైదరాబాద్​ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులకు కరోనా

ABOUT THE AUTHOR

...view details