ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సెలెక్ట్ కమిటీ దస్త్రం వెనక్కి... మండలి ఛైర్మన్​ నిర్ణయంపై ఉత్కంఠ

వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేయకుండా ఆ దస్త్రాన్ని మండలి ఛైర్మన్ షరీఫ్‌ కార్యాలయానికి అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తిప్పి పంపారు. సెలెక్ట్ కమిటీ అంశంపై కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చల్లో భాగంగా... శాసనసభ కార్యదర్శి తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో మండలి ఛైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ నెలకొంది.

select committee issues in ap legislative council
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు పై ఉత్కంఠగా మారిన మండలి ఛైర్మన్ నిర్ణయం

By

Published : Feb 11, 2020, 6:33 AM IST

Updated : Feb 11, 2020, 6:51 AM IST

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు బ్రేక్‌ పడింది. కమిటీ ఏర్పాటు చేసేందుకు మండలి ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ కార్యాలయం నుంచి పంపిన దస్త్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి సోమవారం తిప్పి పంపినట్లు సమాచారం. మండలి 154వ నిబంధన కింద తనకున్న విచక్షణాధికారంతో ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు గత నెల 22న శాసనమండలిలో ఛైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీ కార్యదర్శిని ఆయన ఆదేశించారు. అయితే ఆ నిబంధన ఆధారంగా సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయడం సాధ్యపడదని అసెంబ్లీ కార్యదర్శి సోమవారం ఛైర్మన్‌కు తిప్పి పంపిన దస్త్రంలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇప్పుడు ఛైర్మన్‌ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ఆది నుంచీ వివాదమే...
ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే విషయంలో గత నెలలో మండలి సమావేశాలు ముగిసినప్పటి నుంచి అధికార, ప్రతిపక్షం మధ్య సంవాదం జరుగుతూనే ఉంది. బిల్లులను కమిటీకి పంపుతున్నట్లు సభలోనే ప్రకటించిన ఛైర్మన్‌, ఆ తర్వాత ...‘కమిటీలో నియమించేందుకు మీ ప్రతినిధుల(ఎమ్మెల్సీలు) పేర్లను ఇవ్వండి’ అని మండలిలో ఉన్న పక్షాలను కోరారు. ప్రతిపక్షం నుంచి కొందరు ప్రతినిధుల పేర్ల వివరాలు ఛైర్మన్‌ కార్యాలయానికి వచ్చాయి. అధికార వైకాపా మాత్రం ఈ కమిటీని పరిగణనలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది. ఇవి ముఖ్యమైన బిల్లులు కాబట్టి, వీటిపై ప్రజాభిప్రాయాన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ఛైర్మన్‌ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. మండలిలో ఓటింగ్‌ జరగకుండా, సభ ఆమోదం పొందకుండా కేవలం ఛైర్మన్‌ విచక్షణాధికారం పేరుతో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం నిబంధనలకు విరుద్ధమని అధికారపక్షం అసెంబ్లీ కార్యదర్శికి స్పష్టం చేసింది. తమ ప్రతినిధుల పేర్లను వైకాపా ఇవ్వకపోతే ఇప్పటివరకూ వచ్చిన పేర్లలోనే సీనియర్‌ సభ్యుడిని ఛైర్మన్‌గా ఎంపిక చేసి కమిటీని నియమించాలని ప్రతిపక్ష తెదేపా ఛైర్మన్‌ను కోరింది. అదే విషయాన్ని అసెంబ్లీ కార్యదర్శికీ నివేదించింది. దీనిపై కొన్ని రోజులుగా చర్చలూ జరిగాయి. చివరిగా కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ సోమవారం అసెంబ్లీ కార్యదర్శి మండలి ఛైర్మన్‌కు దస్త్రాన్ని తిప్పి పంపారు.

ఇదీ చూడండి:నేడు తెదేపా రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం

Last Updated : Feb 11, 2020, 6:51 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details