ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తీవ్ర పరిణామాలు తప్పవు'... సీఎస్​కు ఎస్​ఈసీ నిమ్మగడ్డ హెచ్చరిక - AP IAS praveen prakash latest news

sec nimmagadda ramesh kumar
sec nimmagadda ramesh kumar

By

Published : Jan 30, 2021, 5:32 PM IST

Updated : Jan 31, 2021, 4:02 AM IST

17:29 January 30

సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి  ప్రవీణ్‌ ప్రకాష్‌ను బదిలీ చేయాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ అమలు చేయనందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయకుండా ఉండేందుకు.. సీఎస్‌కు విచక్షణాధికారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల్ని సీఎస్‌ ఉద్దేశపూర్వకంగానే ధిక్కరించినట్లు భావించాల్సి ఉంటుందని, దానికి తగిన పరిణామాలూ ఉంటాయని తెలిపారు. ఈ మేరకు ఎస్‌ఈసీ శనివారం సీఎస్‌కు లేఖ రాశారు. 

 ‘‘ఎస్‌ఈసీకి ప్రభుత్వం సహకారం అందించాలని హైకోర్టు ఆదేశించింది. దానికి కట్టుబడి ఉంటామని మీకంటే ముందు ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధికారి హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించారు. ప్రస్తుత వ్యవహారంలో మీ వైఖరి హైకోర్టు, ఎన్నికల సంఘం ఆదేశాల్ని ధిక్కరించేలా ఉంది’’ అని రమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వం సహకరించనందుకు ఎస్‌ఈసీ దాఖలుచేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ప్రస్తుత వ్యవహారానికి సంబంధించిన పూర్తి వాస్తవాల్ని, మన మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను, మీ వైఫల్యాలను కూడా కోర్టుముందు ఉంచాల్సి వస్తుంది’’ అని ఆయన తెలిపారు. ‘‘కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ తలపెట్టిన వీడియో సమావేశాన్ని.. పంచాయతీ ఎన్నికలపై యథాతథ స్థితి కొనసాగించేందుకు తానే అడ్డుకున్నానని ప్రవీణ్‌ ప్రకాష్‌ అంగీకరించారు. ఆయనిచ్చిన ఉత్తర్వుల వల్లే తొలిదశ పంచాయతీ ఎన్నికలకు విఘాతం కలిగింది. తప్పు చేసిందే కాకుండా, దాన్ని ప్రవీణ్‌ ప్రకాష్‌ సమర్థించుకున్నారు. తాను తప్పు చేశానన్న పశ్చాత్తాపం కూడా ఆయనలో లేదు. తప్పు చేశానని అంగీకరించిన తర్వాత కూడా.. ఆయనను అదే పోస్టులో కొనసాగిస్తే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు విఘాతంగా మారుతుంది’’ అని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రవీణ్‌ ప్రకాష్‌ను బదిలీ చేయాలని, ఎన్నికల విధులకు ఆయనను దూరంగా ఉంచాలని మరోసారి ఆదేశిస్తున్నట్టు తెలిపారు.

కలెక్టర్ల పేర్లూ పంపలేదు
గుంటూరు, చిత్తూరు కలెక్టర్లుగా నియమించేందుకు తగిన అధికారుల పేర్లను సీఎస్‌ పంపించలేదని ఎస్‌ఈసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘గుంటూరు, చిత్తూరు జిల్లాలకు కలెక్టర్లు లేకపోతే ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది కలుగుతుంది. తప్పు పట్టడానికి వీల్లేని విధంగా డీజీపీ ప్రతిపాదనలు పంపించారు. కమిషన్‌ ఆదేశాలను అమలు చేశారు. సరైన, పారదర్శకమైన జాబితా పంపించడంలో మీరు విఫలమయ్యారు’’ అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పుడు జారీచేసిన ఆదేశాలను వెంటనే అమలు చేసి, జాబితా పంపించాలని స్పష్టంచేశారు.

ఎన్నికల పర్యటనల్లో మంత్రులు ప్రభుత్వ వాహనాలు వాడకూడదు
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తే... అది ఎన్నికల పర్యటన కిందకే వస్తుందని, వారి వెంట భద్రతా సిబ్బంది తప్ప ప్రభుత్వ సిబ్బంది ఎవరూ ఉండటానికి వీల్లేదని ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. వారు ప్రభుత్వ వాహనాలనూ వినియోగించరాదని తెలిపారు. ఈ మేరకు ఆయన సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు శనివారం లేఖ రాశారు. ఫలితాలు వెలువడే వరకూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రభుత్వ వాహనాలను సమకూర్చకూడదని స్పష్టం చేశారు. కేబినెట్‌ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల సమయంలో ప్రభుత్వ వాహనాల్లో పార్టీ కార్యాలయాలకు వెళ్లరాదని, పార్టీ కార్యకలాపాల్ని వివరించేందుకు నిర్వహించే విలేకరుల సమావేశాల్లో ప్రభుత్వ సదుపాయాలు, వసతులను వినియోగించరాదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

అధికార పర్యటన పేరుతో ప్రచారం చేసేందుకు వీల్లేదు: ఎస్​ఈసీ

సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్​ప్రకాష్​ను తప్పించాలని.. సీఎస్​కు ఎస్‌ఈసీ లేఖ

Last Updated : Jan 31, 2021, 4:02 AM IST

ABOUT THE AUTHOR

...view details