పరిషత్ ఎన్నికల నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎస్ఈసీ నీలం సాహ్నితో భేటీ అయ్యారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి వచ్చిన పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఎస్ఈసీతో భేటీ అయ్యారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ఎస్ఈసీ అధికారులతో చర్చించారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ సామగ్రి తరలింపు, సిబ్బంది కేటాయింపు.. తదితర అంశాలపై ఎస్ఈసీ ఆరా తీశారు. ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నీలం సాహ్ని సూచించారు.
పరిషత్ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ఎస్ఈసీ ఆరా - Parishad elections in AP
ఎస్ఈసీ నీలం సాహ్నితో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. పరిషత్ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించిన అధికారులు... బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ సామగ్రి తరలింపుపై సమాలోచనలు చేశారు. పోలింగ్ సిబ్బంది కేటాయింపు, ఇతర అంశాలపై చర్చించారు.
అనంతరం జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణపై తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో 13 జిల్లాల ఎన్నికల సూపర్వైజరీ ఆఫీసర్లతో... ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ సమావేశమయ్యారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లు, సిబ్బందిని సన్నద్దం చేయడంపై అధికారులకు సూచనలు చేశారు. వాయిదా పడిన ఎన్నికలను ఆగిపోయిన స్థాయి నుంచి కొనసాగించడంపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియను పటిష్టంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని, మొత్తం ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా.. సూపర్వైజరీ అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండీ... పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో జనసేన పిటిషన్