ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Schools Reopen: రెండేళ్ల తర్వాత.. జూన్​లో తెరుచుకుంటున్న బడులు - Schools open in TS

Schools in Telangana : రెండేళ్ల కరోనా విలయం తర్వాత ఈ ఏడాది జూన్​లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచే తెలంగాణ రాష్ట్రంలో బడులు తెరుచుకోనున్నాయి. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని సర్కారు స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ప్రారంభం కానుంది. ఒకవైపు ఉపాధ్యాయుల కొరత వేధిస్తుంటే.. మరోవైపు ఇంతవరకు పాఠ్యపుస్తకాల ముద్రణే జరగలేదు. మరీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!

1
1

By

Published : Jun 12, 2022, 9:44 AM IST

Schools in Telangana: తెలంగాణ రాష్ట్రంలో రెండు విద్యా సంవత్సరాల తర్వాత మళ్లీ జూన్‌లో పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 13న విద్యాలయాల తలుపులు తెరుచుకోబోతున్నాయి. కరోనాతో గత రెండు విద్యా సంవత్సరాలు ఆగమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా 2020-21లో 2 (ఫిబ్రవరి, మార్చి) నెలలు మాత్రమే ప్రత్యక్ష తరగతులు జరిగాయి. గత ఏడాది సెప్టెంబరు నుంచి తరగతులు ప్రారంభమైనా 50 శాతం మంది విద్యార్థులే ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. ఈసారి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2 నుంచి 8 తరగతులకు ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తున్నారు. విద్యార్థుల సౌలభ్యం కోసం పాఠ్యపుస్తకాలను రెండు భాషల్లో ప్రచురిస్తున్నారు. అయితే ముద్రణ ఇంకా పూర్తికాలేదు.

19 వేల పోస్టుల ఖాళీ..:విద్యాశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 19 వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలున్నాయి. 2019-20లో 12,600 మంది విద్యా వాలంటీర్లు సేవలందించారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు సరిగా నడవక.. 2020-21, 2021-22 విద్యాసంవత్సరాల్లో వాలంటీర్లను నియమించలేదు. ప్రస్తుతం టెట్‌ నిర్వహిస్తున్నారు. తర్వాత టీచర్ల నియామక పరీక్ష(టీఆర్‌టీ) జరిపినా భర్తీకి ఏడాది సమయం పడుతుందని అంచనా. అంటే ఈ విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులు రావడం అనుమానమే. అయినా ఈ ఏడాది విద్యా వాలంటీర్లను నియమించడంలేదు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నా ఉపాధ్యాయ ఖాళీలపై విద్యాశాఖ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలతో నాణ్యమైన విద్య ఎలా అందిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.

కస్తూర్బాల్లోనూ ఇదే పరిస్థితి..:రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీలు) 475 ఉన్నాయి. ఈసారి మరో 20 రానున్నాయి. 210 కస్తూర్బాల్లో ఇంటర్‌ వరకు బోధిస్తున్నారు. ఈ ఏడాది మరో 37 చోట్ల ఇంటర్‌ బోధన చేపట్టనున్నారు. ఇప్పటికే ఉన్న ఖాళీలు సహా దాదాపు 1500 మంది ఉపాధ్యాయులను నియమించాల్సి ఉన్నా.. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. గత ఏడాది ఒప్పంద పద్ధతిన ఉపాధ్యాయులను నియమించాలని విద్యాశాఖ భావించినా ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఈ ఏడాదైనా నియమిస్తుందా.. లేదా అనే విషయంలో స్పష్టత లేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details