స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందాన మారింది. అసలే కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చతికిల పడగా.. తాజాగా ఎన్నికల్లో డబ్బులు పంచడం తలకుమించిన భారమవుతోంది. గత సర్పంచి ఎన్నికల్లో ఓటుకు రూ.300 నుంచి రూ.500లతో సర్దుబాటు చేయగా.. ప్రస్తుతం ఆ మొత్తం రెండు, మూడు రెట్లు పెరిగినట్లు సమాచారం. గెలుపోటములను ప్రభావితం చేసే వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేలు కూడా ఇవ్వాల్సి వస్తోందని కొందరు అభ్యర్థులు తమ అనుచర గణంతో వాపోతున్నట్లు భోగట్టా.
మీ వార్డులో, ప్రాంతంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? అక్కడి ఓటర్లు ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారు? ఒక్కో ఓటుకు ఎంత మొత్తం ఆశిస్తున్నారు? తదితర అంశాలపై జోరుగా చర్చ సాగుతోంది. ఓటుకు రూ.1000 నుంచి రూ.2000 ఇస్తే తప్ఫా. తట్టుకోలేమని ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి సమాధానం వస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన పంచాయతీలో 60 శాతం ఓటర్లకైనా ‘డబ్బు పంపిణీ’ తప్పదని అంచనా వేస్తున్నారు. ముందు విడత రూ.వెయ్యి పంపిణీ చేసి, అవసరాన్ని బట్టి పెంచుదామన్న యోచనలో నాయకులు ఉన్నారు. మరోవైపు సమయం తక్కువగా ఉండటంతో నగదు సేకరణ గురించి అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు అభ్యర్థులైతే ఆరేడు రూపాయల వడ్డీకి కూడా అప్పులు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.