తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ కళకళలాడుతోంది. పట్నం నుంచి పల్లె వరకు ప్రతి ఇంటి ముంగిటా రంగవల్లులు హరివిల్లులను తలపిస్తున్నాయి. బంధుమిత్రులు, కొత్త కోడళ్లు, అల్లుళ్ల రాకతో పల్లెలు కోలాహలంగా మారాయి. నిన్నంతా భోగి భాగ్యాలతో సంబరాలు జరుపుకున్న తెలుగు ప్రజలు.. నేడు సంక్రాంతికి స్వాగతం చెబుతూ తెల్లవారుజాము నుంచే సందడి చేస్తున్నారు. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు.. వేకువజామునే జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలూ అక్కడక్కడా పిట్టలదొరల బడాయి మాటలతో పట్టణాలు, పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి.
కృష్ణమ్మ నదీ తీరాన సంక్రాంతి వేడుకలు అంగరంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పర్యాటకాన్ని పెంచేందుకు ఏపీ టూరిజం ఆధ్వర్యంలో సంబురాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెయింటింగ్ కళాకారులు.. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా చిత్రాలు గీశారు. వారి బొమ్మల్లో పల్లెదనం కళ్లకు కట్టేలా చూపించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భవానీ ద్వీపంలో యువత, నగర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బోటింగ్ లో విహరిస్తూ కృష్ణమ్మ అందాలు చూశారు. సెల్పీలు దిగి కుటుంబ సభ్యులతో హాయిగా గడిపారు.
కర్నూలులో వాసవీ సేవాదళ్ ఆధ్వర్యంలో... సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పిల్లలందరికీ పెద్దలు భోగిపళ్లు పోశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను కట్టిపడేశాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.