ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇసుక సమస్య.. అనుకూలంగా మార్చుకుంటున్న అక్రమార్కులు..!

ఇసుక సరఫరాలో సమస్యలేవీ లేవని... నాణ్యమైన ఇసుకనే అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులు ముప్పుతిప్పలు పడుతున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా కొనసాగుతున్న ఇసుక బుకింగ్‌లో... సర్వర్‌ సతాయింపు ఎక్కువగా ఉంటోంది. అవసరమైన రకం ఇసుక కాకుండా... వేరే రకం ఇస్తున్నారని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Sand Shortage In Andhra Pradesh
Sand Shortage In Andhra Pradesh

By

Published : Dec 19, 2020, 4:44 AM IST

పాత ఇసుక పాలసీ రద్దు అయి... స్పష్టమైన కొత్త విధానం లేకపోవడం దగ్గర నుంచి మొదలైన ఇసుక కష్టాలు... నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ సమస్యను కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకోవడం, మధ్యవర్తులు, అక్రమంగా రవాణా చేసేవాళ్లు అడ్డూఅదుపూలేకుండా వ్యాపారాలు సాగిస్తుండటమూ దీనికి కారణమని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

రీచ్‌ల్లో తవ్వకాలు, రవాణా చేసే గుత్తేదారులు, కొందరు సిబ్బంది సహకారంతో నిల్వలను దారి మళ్లిస్తున్నారు. ఇటీవల రాజంపేట వద్ద చెయ్యేరు నుంచి కడప జిల్లా కేంద్రంలో ఉన్న డిపోకి చేరాల్సిన ఇసుక.. భారీగా దారి మళ్లింది. ప్రత్యేక కార్యదళం తనిఖీల్లో దాదాపు 35 వేల టన్నులు చేరలేదని గుర్తించారు. గతంలో బద్వేలు డిపో పరిధిలోనూ ఇలానే అక్రమాలు జరిగాయి. రాజంపేట పరిధిలోనే చెయ్యేరు సమీపంలో ఓ పట్టా భూమిలో అనుమతించిన చోటకాకుండా వేరొకచోట 20 వేల టన్నులకుపైగా తవ్వారని తేల్చారు.

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరులో అన్నిచోట్లా సీసీ కెమెరాల జాడ లేదు. వే బ్రిడ్జిలూ లేవు. బుక్‌ చేసిన దానికంటే ఎక్కువ లోడ్‌ చేసుకుని వెళ్లి అదనపు డబ్బులు తీసుకుని జేబులో వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రకాల్వ, తమ్మిలేరులో అనధికారికంగా రాత్రులు తవ్వకాలు జరుగుతున్నాయి.

వరుస తుపాన్లు, భారీ వర్షాలతో నదుల్లో నీటి ప్రవాహం ఇంకా ఉండటంతో చాలా రీచ్‌ల్లో తవ్వకాలు జరగడం లేదు. నదుల్లో 120 ఓపెన్‌ రీచ్‌లు ఉండగా ప్రస్తుతం 22 మాత్రమే పనిచేస్తున్నాయి. పూడికలు ఉండే 80 రీచ్‌లకుగానూ 46 చోట్ల బోట్స్‌మన్‌ సొసైటీలతో తవ్వకాలు జరిపిస్తున్నారు. దీనివల్ల పలు జిల్లాల్లో ఇసుక నిల్వలు నిండుకుంటున్నాయి.

కృష్ణా జిల్లా నుంచి దాదాపు మూడున్నర లక్షల టన్నులను గుంటూరు జిల్లాకు తరలించారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో లక్ష టన్నుల నిల్వ మాత్రమే ఉంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఎమ్మిగనూరు వంటి ప్రాంతాల్లోని నిల్వ కేంద్రాలకు కడప నుంచి ఇసుక వచ్చేది. వరదల కారణంగా సరఫరా ఆగిపోయింది. వర్షాకాలం అవసరాలకు దాదాపు 50 లక్షల టన్నులకుపైగా ముందస్తుగా నిల్వ ఉంచగా... ఇప్పుడు 18 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది.

విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒడిశా నుంచి వస్తున్న ఇసుకకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి తీసుకొస్తున్న ఇసుకలో నాణ్యత లేమి, అధిక ధర కారణాలతో విశాఖ వాసులు ఒడిశా ఇసుక కొనుగోలు చేస్తున్నారు. ఇతర సరకులతో ఆ రాష్ట్రానికి వెళ్తున్న వాహనాలు తిరుగు ప్రయాణంలో అధికారికంగా కొనుగోలు చేసిన ఇసుకతో వస్తున్నాయి. ఇక్కడితో పోలిస్తే టన్ను ఇసుక ధర 200 నుంచి 300 తక్కువగా ఉండటంతో వినియోగదారులు ఒడిశా ఇసుకకే మొగ్గుచూపుతున్నారు.

ఇదీ చదవండీ... నష్టపోయిన రైతులకు పెట్టుబడి కింద రాయితీ చెల్లింపుల

ABOUT THE AUTHOR

...view details