ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇసుక దొరకట్లే.. ఆన్​లైన్​లో నిమిషాల్లోనే ఖాళీ! - ఆంధ్రాలో ఇసుక సమస్యలు న్యూస్

ఇసుక మళ్లీ కన్నీళ్లు తెప్పిస్తోంది. సామాన్యుడికి ట్రాక్టర్‌ ఇసుక కావాలన్నా ఆపసోపాలు పడాల్సి వస్తోంది. చెంతనే నదులున్న మండలాల్లోనూ ఇసుక దొరకడం గగనమైపోయింది. వర్షాకాలం కోసం పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, ప్రస్తుత అవసరాలకు తగినంత దొరకడం లేదు. దీంతో విసుగు చెంది దళారుల వద్ద అధిక ధరకు కొంటున్నారు.

sand problem in andhrapradesh
sand problem in andhrapradesh

By

Published : Jun 7, 2020, 5:06 AM IST

Updated : Jun 7, 2020, 6:20 AM IST

ఆన్‌లైన్లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటలలోపు ఇసుక బుక్‌ చేసుకునేలా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అవకాశం కల్పించింది. కొన్ని కేంద్రాల్లో 10-15 నిమిషాల్లో ఇసుకంతా బుక్‌ అయినట్లు చూపుతోంది. నెట్‌ వేగం అధికంగా ఉండేవాళ్లు, బుకింగ్‌లో అనుభవం ఉన్నవారికే దొరుకుతోంది. కొత్తవారికి చుక్కలు కనిపిస్తున్నాయి.

విజయవాడలో అశోక్‌ అనే వ్యక్తి ఇల్లు కట్టుకుంటున్నారు. శనివారం ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకోవాలనుకున్నారు. మద్దూరు నిల్వ కేంద్రం దగ్గరగా ఉండటంతో అక్కడి ఇసుక తీసుకోవాలనుకున్నారు. మధ్యాహ్నం 12.30కి బుకింగ్‌కు అవకాశం కలిగింది. ఆయన వివరాలు నమోదు చేసేసరికి అక్కడున్న 432 టన్నులు అమ్ముడైపోయిందని చూపింది. తప్పనిసరి కావడంతో సుబ్బయ్యగూడెం నుంచి 18 టన్నుల ఇసుక రవాణా ఛార్జీలతో కలిపి రూ.15 వేలకు బుక్‌ చేశారు. అదే మద్దూరు నుంచైతే రూ.10 వేలకే లభించేదని ఆయన తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గాదె వెంకటరాజు ఇంటి నిర్మాణం కోసం 5 యూనిట్ల ఇసుకను రూ.17వేలతో ఆన్‌లైన్‌లో బుక్‌ చేశారు. 12 రోజుల తర్వాత రాత్రివేళ వేళ లారీలో ఇసుక తెచ్చి వేశారు. తెల్లవారాక చూస్తే అదంతా నాసిరకంగా ఉంది. టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసినా ఎవరూ స్పందించలేదు.

వర్షాకాలంలో అవసరాల కోసం 70 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేయాలని నిర్ణయించారు. లాక్‌డౌన్‌ రావడంతో తవ్వకాలు, విక్రయాలు నిలిపేశారు. వర్షాకాలానికి అవసరమైన ఇసుక తవ్వకాలకు ఏప్రిల్‌లో అవకాశం ఇచ్చారు. గత నెలలో సాధారణ ఇసుక బుకింగ్‌ మళ్లీ ఆరంభించారు. కొన్ని రీచ్‌ల్లో తవ్విన ఇసుకను వర్షాకాలం నిల్వ కోసం తరలిస్తుండటంతో సమస్య తీవ్రమవుతోంది. నిల్వ కేంద్రాలు గతంలో 120 ఉండగా, ప్రస్తుతం 70 వరకే పనిచేస్తున్నాయి. దీంతో అన్నిచోట్లా అవసరమైన ఇసుక లభించడం లేదు.

  • నాసిరకం మాకొద్దు

నదుల మధ్యలో నుంచి తెచ్చే ఇసుక సున్నితంగా ఉండటంతో ప్లాస్టరింగ్‌, ఇతర అవసరాలకు వినియోగిస్తారు. దీనికి డిమాండ్‌ ఎక్కువ. ఒడ్డున ఉండేదాన్ని శ్లాబ్‌లు, తదితరాలకు వినియోగిస్తారు. నదులను ఆనుకొని పట్టా భూముల్లో తవ్విన ఇసుకలో మట్టి కూడా కలుస్తుంది. దీనిపై ఎవరికీ ఆసక్తి ఉండదు. దీంతో నదులు, మధ్యలో పూడికల వద్ద తవ్విన ఇసుకనే అంతా కోరుతున్నారు. ఈ ఇసుక ఎప్పటికప్పుడు వెంటనే బుక్‌ అవుతోంది. మిగిలిన చోట్ల అలాగే ఉంటోంది.

  • నిల్వలు పెంచుతాం

కొన్ని నిల్వ కేంద్రాల్లో ఇసుక వెంటనే బుక్‌ అవుతున్న మాట నిజమేనని ఏపీఎండీసీ అధికారులు చెబుతున్నారు. అక్కడ నిల్వలు పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. జూన్‌ 1 నుంచి నిత్యం సగటున లక్ష టన్నుల మేర తవ్వుతున్నట్లు చెప్పారు. శుక్రవారం 1.26 లక్షల టన్నులు తవ్వి తీసినట్లు వివరించారు. వర్షాలు మొదలైతే ఇసుక తవ్వకాలకు ఆటంకం కలుగుతుందనే, 70 లక్షల టన్నుల నిల్వకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. సామాన్యుల అవసరాలకూ నిల్వలు పెంచుతామని, ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం ఇసుక బుక్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: విశాఖ నౌకాదళ గూఢచర్యం కేసులో కీలక సూత్రధారి అరెస్టు

Last Updated : Jun 7, 2020, 6:20 AM IST

ABOUT THE AUTHOR

...view details