స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో ఎస్ఈసీ రమేశ్ కుమార్ పరిధి మరిచి వ్యవహరించారని... ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రమేశ్ కుమార్ నిర్ణయం తప్పని అన్నారు. దురాలోచనతో తీసుకున్న నిర్ణయంగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ గురించే ఆలోచించి ఉంటే అందరిని సంప్రదించి ఉండాల్సిందన్నారు. ఎన్నికల కమిషనర్ అనే వారు ఓ వ్యక్తి కాదు ఓ వ్యవస్థ అని, అఖిలపక్షంలో పార్టీలు కోరినప్పుడు ఒకలా.. నిన్న మరోలా స్పందించడం ఏమిటని ప్రశ్నించారు.
'కరోనా వైరస్ అంటే ఏంటో ఎవరికి తెలియదు. కరోనాను నియంత్రించేందుకు అగ్రరాజ్యమైన అమెరికానే మల్లగుల్లాలు పడుతోంది. మన రాష్ట్రం నియంత్రించగలదా ..? వ్యాక్సిన్లు ఇస్తే పోవడానికి అదేమైనా కలరానా? ప్రపంచ దేశాలే ఎలా నియంత్రించాలని ఆలోచిస్తున్నాయి. అలాంటి కరోనాను తట్టుకోవాలన్నా...క్షేత్రస్థాయిలో నియంత్రించేందుకు ఉపయోగపడేదే ఈ లోకల్ బాడీ వ్యవస్థ. ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ఉంటే...వాలంటీర్ల సహకారంతో ఊర్లోకి కొత్త వాళ్లు ఎవరు వస్తున్నారు? ఏమైనా రోగాలున్నాయా అనేది గుర్తించవచ్చు. అలాంటి వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక రకమైన విరుగుడు మాత్రమే. ఈ వ్యవస్థ తయారవ్వడం అనేది కేవలం పది రోజుల్లో అయిపోతుంది. ఓ చట్రంలా తయారయ్యే వ్యవస్థతో ఈ అర్థం కాని కరోనా వ్యాధిని డీల్ చేసే అవకాశం ఉంది. అలాంటి దానికి చివర్లో అడ్డం పడ్డారు.'
- సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
ఉద్దేశ్యం ప్రకారమే నిలిపివేత
వాయిదాకు సంబంధించిన నిర్ణయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్రకటించడాన్ని సజ్జల తప్పుబట్టారు. ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కమిషనర్ బాధ్యతని, ఎన్నికలకు సంబంధం లేకుండా ముందే ప్రకటించిన ఉచిత ఇంటి స్థలం పథకాన్ని ఉద్దేశ్య ప్రకారం నిలిపి వేసినట్టు అనిపిస్తోందన్నారు. కమిషనర్ ఆలోచన ప్రకారం చూస్తే రేషన్ పంపిణీ కూడా ప్రలోభం కిందే వస్తుందా అని ప్రశ్నించారు.