రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనల వెనుక ఎంతటి వారున్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదని.. కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నా ప్రభుత్వం కచ్చితంగా పట్టుకుంటుందని.. ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఎవరు ఉన్నారనే విషయంపైనా దర్యాప్తు జరుపుతోందన్న ఆయన.. దోషులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటున్నాయని, ప్రమాదకర రాజకీయాలు చేస్తునాయన్న సజ్జల ... రాజకీయ లబ్ధి కోసం భావోద్వేగాలు రెచ్చగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. భాజపాతో జతకట్టాలనే తాపత్రయంతో చంద్రబాబు ఇలా చేస్తున్నట్లు భావిస్తున్నామని అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయ నేతల ఉపన్యాసాల ప్రభావానికి పీఠాధిపతులు ప్రభావితం కావొద్దని కోరారు. స్వాములు సంయమనం పాటించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు.
విగ్రహాల ధ్వంసంపై భాజపా నేతల వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో చాలాచోట్ల దాడులు జరిగినా... ఏపీ తరహాలో ఎక్కడైనా వెంటనే చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో దుబ్బాక సహా హైదరాబాద్ లో పలు డివిజన్లు గెలిచిన భాజపా... ఏపీలోనూ గెలిచేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఆతృతతో మాట్లాడం చూస్తే... అలాగే అనిపిస్తోందన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఏపీలో గెలుస్తామనే భ్రమలో భాజపా ఉందని ఎద్దేవా చేశారు.