ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amaraja Company: అమరరాజా సంస్థను మేము పొమ్మనడంలేదు: సజ్జల

అమరరాజా సంస్థను తాము పొమ్మనడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు పాటించి నడుపుకోవచ్చని సూచించారు. వాయు, నీటి కాలుష్యం చేయకుండా నిబంధనల మేరకు పరిశ్రమను నడిపిస్తామంటే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

sajjala rama krishna
sajjala rama krishna

By

Published : Aug 5, 2021, 7:29 AM IST

అమరరాజా బ్యాటరీస్‌ సంస్థను తాము ఇక్కడి నుంచి పొమ్మనడం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు పాటిస్తూ తిరిగి అనుమతులు తీసుకుని నడుపుకోవచ్చని సూచించినట్లు తెలిపారు. బుధవారం తిరుపతిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. వాయు, నీటి కాలుష్యం చేయకుండా నిబంధనల మేరకు పరిశ్రమను నడిపిస్తామంటే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. పర్యావరణానికి హాని జరుగుతున్న విషయమై హైకోర్టు, కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు చర్యలు పాటించాలన్నారు. ఇందుకు గడువునిచ్చి.. నియంత్రణ చర్యలకు అవకాశం కూడా ఇచ్చినట్లు తెలిపారు.

వాళ్లు పక్క రాష్ట్రాలకు పోతామంటే తాము ఏమీ చేయలేమని, ఉద్యోగాల కంటే కార్మికుల ఆరోగ్యం ముఖ్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని, వాటిని అతిక్రమించిన 66 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చి 50 పరిశ్రమలను పీసీబీ మూయించిందని, ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని వివరించారు. అమరరాజా చుట్టూ ఉన్న చెరువుల నీరు, సిబ్బంది రక్త నమూనాలను పరీక్షించినట్లు తెలిపారు.

ఆచితూచి వ్యవహరిస్తున్నాం

పోతూ పోతూ తెదేపా ప్రభుత్వం ఎంత అప్పు పడేసింది, కొవిడ్‌తో ఎంత నష్టం జరిగిందీ అందరికీ తెలిసిందేనన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎలా నడపాలని ఆలోచిస్తూ... ఆచితూచి వ్యవహరిస్తున్నామని సజ్జల తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టామని వివరించారు. వెసులుబాటు ఉన్నప్పుడు అడ్డంగా అప్పులు చేశారని, ఈ రోజు పరిమితులు విధించడంతో సమస్యలు తలెత్తాయని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగా అప్పుల పాలు కాక తప్పట్లేదని, ఇందులో కేంద్రానికీ మినహాయింపు లేదని చెప్పారు.

చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్‌ పరిశ్రమ.. తమిళనాడులో యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడంతో కసరత్తు ముమ్మరం చేసింది. స్థలం కేటాయింపునకు సంబంధించి ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్‌, అమరరాజా బ్యాటరీస్‌ యాజమాన్యం మధ్య చర్చలు సాగినట్లు సమాచారం. తమ సంస్థకు రాష్ట్రంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో.. చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ‘అడ్వాన్స్‌డ్‌ లిథియం టెక్నాలజీ రీసెర్చ్‌ హబ్‌’ను తమిళనాడులో నెలకొల్పాలని సంకల్పించింది. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక అమరరాజా సంస్థలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి.

చిత్తూరు సమీపంలోని నూనెగుండ్లపల్లెవద్ద ఏర్పాటు చేసిన పరిశ్రమకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవడం, కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు, పరిశ్రమల మూసివేత ఉత్తర్వులు జారీ, విద్యుత్‌ సరఫరా నిలిపివేత వంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకున్నాయి. సంస్థ హైకోర్టును ఆశ్రయించగా... విచారణ అనంతరం న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మళ్లీ పరిశ్రమలు తెరుచుకున్నాయి. ఆ తర్వాతా తరచూ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేపట్టడం వేధింపుల్లో భాగమేనని యాజమాన్యం భావిస్తోంది. ఇటీవల సంస్థ నాయకత్వంలో సంస్థాగత మార్పులు జరిగాయి.

Amara Raja unit: చిత్తూరులో ఏర్పాటు చేయాల్సిన అమరరాజా యూనిట్‌ తమిళనాడుకు తరలింపు!

ABOUT THE AUTHOR

...view details