తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో తాను ఎవరికో మద్దతు ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తన మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాధికేనని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో వెదజల్లుతున్న డబ్బులను వాటికే ఖర్చు పెట్టాలన్నారు. ఇటీవలే పదవీ విరమణ చేసిన తాను... ప్రస్తుతం ఓ ఇల్లు వెతుక్కునే పనిలో నిమగ్నమైనట్లు ఆయన తెలిపారు. తనను అనవసరంగా హుజూరాబాద్ వ్యవహారంలోకి లాగవద్దని.. అంచనాలు తలకిందులవుతాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
స్వచ్ఛంద విరమణ
26 ఏళ్లు ఐపీఎస్ అధికారిగా సేవలు అందించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) ఇటీవలే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఇంకా ఆరేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలీసు అధికారిగా సేవలు అందించి.. ప్రవీణ్‌కుమార్ గుర్తింపు తెచ్చుకున్నారు. పేదలకు నాణ్యమైన చదువు అందాలని భావించి సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యతలు చేపట్టారు. సంక్షేమ వసతి గృహాల్లో సమూల మార్పులు చేశారు.
స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే వాటిలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తాను ఎవరికీ మద్దతివ్వను అని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: