Amaravathi: అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.3వేల కోట్ల రుణం కోసం బ్యాంకులను సంప్రదించగా, ఈ మొత్తాన్ని రెండుగా విభజించి, డీపీఆర్లు ఇవ్వాలని వారు సూచించినట్లు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని సీఆర్డీఏ కేంద్ర కార్యాలయంలో బుధవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ‘ఒకే రాజధానిగా ఉంటేనే రుణం ఇస్తామని, ఈ విషయంలో హామీ ఇస్తారా అని బ్యాంకర్లు అడిగినట్లు తెలిసింది. అది నిజమేనా?’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... బ్యాంకులు ఆర్బీఐ నిబంధనల ప్రకారమే రుణాలు ఇస్తాయన్నారు.
ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం..‘భూ సమీకరణ సమయంలో రైతులతో చేసుకున్న ఒప్పందానికి సీఆర్డీఏ కట్టుబడి ఉంది. వారికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించే పనిలో ఉన్నాం. ఇప్పటికే 17వేల మందికి నోటీసులివ్వగా 900 మంది ముందుకొచ్చారు. రోడ్లు, మురికి కాలువలు తదితర వసతులను దశల వారీగా కల్పిస్తాం. ఇవన్నీ ఆర్థిక అంశాలతో ముడిపడి ఉండటంతో సొంతంగా వనరులను సమకూర్చుకునే అంశంపై దృష్టి సారించాం. ఇందులో భాగంగానే ప్లాట్ల వేలం మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ ఏడాదికి సంబంధించి వార్షిక కౌలు కోసం రూ.208 కోట్లను విడుదల చేశాం.
- హ్యాపీనెస్ట్ విషయంలో రెరా ఇచ్చే ఆదేశాలకు పాటిస్తాం. ఫ్లాట్లకు డబ్బులు చెల్లించిన వారు, ఆ మొత్తాన్ని తిరిగివ్వాలని రెరాను ఆశ్రయించారు. దీనికి త్వరలో ఒక పరిష్కారం కనుగొంటాం.
త్వరలో సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి..అమరావతిలో వివిధ పనులకు సంబంధించి గతంలోనే టెండర్లు పిలిచారు. సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడుతున్నాం. నిధుల లభ్యతకు అనుగుణంగా పనులు చేపడతాం. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిలభారత సర్వీసు అధికారుల నివాస సముదాయాల పనులను తిరిగి ప్రారంభించాం. ఇవి నవంబరు నాటికి పూర్తవుతాయనే అంచనా ఉంది.