శీతాకాలంలో ఒకవైపు చలి వణికిస్తోంది.. మరోవైపు తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పొగమంచు పరిసరాలను కమ్మేస్తుంది. ప్రధానంగా పచ్చదనం, చెట్లు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. ఐటీ క్షేత్రాల్లోని ప్రధాన రహదారులతోపాటు ఇటు బాహ్య వలయ రహదారిపై విపరీత మంచుతో ముందు వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంటోంది. ఆ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
తెల్లవారుజాము 4 నుంచి 6.30 వరకు..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అటు ఓఆర్‌ఆర్‌తోపాటు ఇటు ఐటీ క్షేత్రాల్లో పొగమంచు అధికంగా పరుచుకుంటోంది. ఓఆర్‌ఆర్ విశాలంగా ఉండడం.. పచ్చదనంతో అలరారుతుండడం వల్ల పొగమంచు అధికంగా ఉంటోంది. ఇటు ఐటీ క్షేత్రాల్లోని నానక్‌రాంగూడ, మాదాపూర్, రాయదుర్గంలలో పొగమంచు ప్రభావం ఉంటోంది.
ఖాజాగూడ చౌరస్తా నుంచి ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి నానక్‌రాంగూడ విప్రో కూడలి, ఐసీఐసీఐ బ్యాంకు కూడలి మీదుగా ఓఆర్‌ఆర్ వరకు, ఆటు విప్రో జంక్షన్ నుంచి గోపన్‌పల్లి, వట్టినాగులపల్లి, మాదాపూర్ హైటెక్స్ చార్మినార్ కూడలి నుంచి ఖానామెట్ దారుల్లో దట్టంగా వ్యాపిస్తోంది. చలి పెరిగే కొద్దీ అర్ధరాత్రి దాటాక క్రమంగా పెరిగి తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 6.30 వరకు అధికంగా కమ్ముకుంటోంది.
ప్రమాదాలకు ఆస్కారం..
ఓఆర్‌ఆర్‌పై వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన భారీ సరుకుల వాహనాలు, ట్రావెల్స్ బస్సులు, కార్లు వంటి వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సర్వీస్ రోడ్డులో స్థానికంగా వివిధ పనులపై వెళ్లే కార్లు, వ్యాపారాలపై ద్విచక్రవాహనదారులు, ఆటోలు వెళ్తుంటాయి. ఐటీ క్షేత్రాల్లో కూడా అంతగా ట్రాఫిక్ లేకపోయినా కార్లు, ద్విచక్రవాహనాలు, బస్సుల వంటి వాహనాలు రాకపోకలు ప్రారంభమవుతాయి.
ఆ సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉండడం వల్ల వాహనాల వేగం అధికంగా ఉంటోంది. కొందరు ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్లపై ప్రమాదకరంగా వాహనాలు నిలుపుతున్నారు. పొగమంచు కమ్ముకున్న సమయంలో అప్రమత్తంగా లేని పక్షంలో వాహనాలు కనిపించక ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని ట్రాఫిక్ పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రత కొనసాగే వరకూ మంచుప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు.
తప్పనిసరిగా ప్రయాణమైతే..
* తెల్లవారు నుంచి ఉదయం వెలుతురు స్పష్టంగా వచ్చే వరకు అప్రమత్తత అవసరం.