సినిమా టికెట్ల ధరల పెంపుపై త్వరలోనే ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు. ప్రజామోదం, చిత్రపరిశ్రమ హర్షించేలా నిర్ణయం ఉంటుందన్నారు. మరో సమావేశం తర్వాత నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. సినిమా టికెట్ల ధరల పరిశీలనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ ఆధ్వర్యంలోని కమిటీ బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. ఫిల్మ్‌ఛాంబర్ ప్రతినిధులు వ్యక్తిగతంగా, రాతపూర్వకంగా సమస్యల్ని కమిటీకి నివేదించారు. దాదాపు 3 గంటలపాటు సమావేశం జరిగింది. అనంతరం ఫిల్మ్‌ఛాంబర్ ప్రతినిధులు విలేకర్లతో మాట్లాడారు.
సమావేశంలో టికెట్ల ధరల పెంపుపైనే చర్చించాం. ఏ, బీ, సీ సెంటర్లన్నింటిలో ధరలు పెంచాలని కోరాం. ఈ కమిటీ ద్వారా ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు మేలు కలుగుతుందని భావిస్తున్నాం. పరిశ్రమకు, ప్రజలకు ఇబ్బంది ఉండకూడదనే ఇన్ని సార్లు చర్చిస్తున్నాం. చిరంజీవి, రాంగోపాల్ వర్మ ఎవరు చర్చించినా పరిశ్రమ మేలు కోసమే. బెనిఫిట్ షోలపై సమావేశంలో చర్చ జరగలేదు. కమిటీ మా సమస్యలపై సానుకూలంగా స్పందించింది. - ముత్యాల రాందాస్, తెలుగు ఫిల్మ్‌ఛాంబర్ ఉపాధ్యక్షుడు
సమస్యల్ని కమిటీకి నివేదించాం. త్వరలో మరో సమావేశం ఉంటుంది. ఆ తర్వాత నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాం. గతంలో మల్టీఫ్లెక్స్ థియేటర్లలో తినుబండారాలు ఎక్కువ ధరకు అమ్మి ఉండవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. - బాలరత్నం, ఎగ్జిబిటర్ల ప్రతినిధి