Ramanujacharya: హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఏర్పాటైంది శ్రీరామ నగరం. చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆశ్రమం.. వైష్ణవ తత్వాన్ని విశ్వవ్యాపితం చేసేందుకు కృషి చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగానే విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన రామానుజాచార్యులకు ఆకాశమంత గౌరవం కల్పించేందుకు సిద్ధమైంది.. ఈ నగరం. వెయ్యేళ్ల క్రితమే సమజంలోని అందరూ సమానమే అంటూ, ఎక్కువ తక్కువలు లేవంటూ.. సమతా భావనను అనుసరించిన మహా పురుషుడికి ఘనమైన గుర్తింపునిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రామానుజాచార్యులు కూర్చున్న భంగిమలో 216 అడుగుల భారీ లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చాలా పనులు పూర్తి కాగా మరికొన్ని పనులు తుది దశకు చేరుకున్నాయి.
45 ఎకరాల్లో 108 ఆలయాలు..
ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లే మార్గాల్లో చాలా దూరం నుంచి రామానుజుల వారి విగ్రహం కనువిందు చేస్తోంది. దగ్గరకు వెళితే.. ఆయన శాంత రూపం, పద్మపీఠంపై పద్మాసనంలో కూర్చున్న భంగిమ.. భక్తి భావాన్ని, ప్రశాంతతను చేకూర్చోతోంది. ఆశ్రమంలోని ఏ మూల నుంచి చూసినా.. అంతా సమానమే అంటూ మౌనంగా బోధ చేస్తున్నట్లుగా రామానుజచార్యులు కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ ఒక్క విగ్రహమే కాదు ఏకంగా 108 ఆలయాల్ని కూడా నిర్మించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధ్యాత్మిక నగరానికి రూపునిచ్చారు చిన్న జీయర్ స్వామి.
రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖుల ఆగమనం..
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ వేడుకలకు శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలుగా నామకరణ చేశారు. 2 వారాల పాటు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలకు.. దేశంలోని ఎంతో మంది ప్రముఖులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సహా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. తొలుత.. ఫిబ్రవరి 2న ఉత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. 3వ తేదీన అగ్ని ప్రతిష్ఠ చేయనున్నారు చిన్న జీయర్ స్వామి. ఫిబ్రవరి 5న సమతా మూర్తి విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.