ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 3, 2020, 3:04 AM IST

ETV Bharat / city

ఈ రాఖీ పండుగకు సోదరికి ఇచ్చేయండి 'ఆర్థిక' బహుమతి

రాఖీ.. సోదరుడి క్షేమం కోరుతూ.. సోదరి ప్రేమతో కట్టే బంధనం. తోబుట్టువులకు ఒకరిపై ఒకరికి ఉండే బాధ్యతకు ఇది గుర్తు. తనకు రాఖీ కట్టిన సోదరికి విలువైన కానుకను ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు సోదరులు. ఇలాంటి సందర్భంలో తనకు ఆర్థిక స్వేచ్ఛనిచ్చే బహుమతిని మించింది ఏముంటుంది చెప్పండి.. మరి, అది జీవితాంతం తోడుండేలా ఎలా ఇవ్వాలి.. తెలుసుకుందాం!

rakhi gift for sisters story
ఈ రాఖీ పండుగకు సోదరికి ఇచ్చేయండి 'ఆర్థిక' బహుమతి

కరోనా మహమ్మారి మన జీవన విధానాన్ని మార్చేసింది. లాక్‌డౌన్‌ నుంచి అన్‌లాక్‌ దశల్లోకి అడుగుపెడుతూ.. ఇప్పుడిప్పుడే కొత్త సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నాం. గతంలోలాగా పండగలప్పుడు అందరం కలిసే రోజులూ దూరమయ్యాయి. ఈసారి రాఖీని అక్క/చెల్లి.. ఆన్‌లైన్‌లో పంపించింది కదా.. మనమూ అలాగే ఒక వస్తువును ఆర్డర్‌ ఇస్తే సరిపోతుంది అనే ధోరణి వద్దు.. ఆన్‌లైన్‌లోనైనా మీరిచ్చే కానుక జీవితాంతం ఉపయోగపడాలి. కొవిడ్‌-19 నేర్పిన ఆర్థిక స్వేచ్ఛ అవసరం తీర్చేదిగా ఉండాలి.

  • సోదరికి ఆర్థికంగా తోడుండటం అందరికీ అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. కానీ, రాఖీలాంటి ప్రత్యేక సందర్భాల్లో తన శక్తి మేరకు సోదరులు ఏదో ఒక బహుమతిని ఇవ్వడం అనాదిగా వస్తున్నదే. పరిస్థితులు మారిన నేపథ్యంలో ఇచ్చే కానుక విధానమూ మారాల్సిన అవసరం ఉంది. ప్రతి రూపాయికీ ఒక లెక్క ఉండాలి. అది మన భవిష్యత్తు అవసరాలను తీర్చేదిగా ఉండాలి. మీరు మీ సోదరికి ఇచ్చే బహుమతీ ఇలాగే ఉండాలని ఆలోచించండి.
  • వస్తువులకన్నా.. ఆర్థిక పెట్టుబడులను బహుమతిగా ఇవ్వడం మంచిదని చెప్పొచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇవ్వకుండా దాన్ని నెలనెలా చిన్న మొత్తంగా విభజించీ అందించవచ్చు. దీనికి మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానాన్ని (సిప్‌)ను పరిశీలించవచ్చు.
  • నెలకు రూ.1,000, రూ.2,000ల కనీస మొత్తంతోనూ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ.. చక్రవడ్డీ ప్రభావంతో ఈ పెట్టుబడి విలువ పెరుగుతూ ఉంటుంది.
  • పెట్టుబడి పథకాలను బట్టి, కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. మీ తోబుట్టువు వయసు, తన అవసరాలను బట్టి, సరైన పథకంలో మదుపు చేయడం ఉత్తమం. మీ సోదరి చిన్న వయసులో ఉండి.. తనకు దీర్ఘకాలంపాటు డబ్బుతో అవసరం ఉండదు అనుకున్నప్పుడు.. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. తన అవసరాలు మారుతుండటం, జీవిత దశలను బట్టి, ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా హైబ్రీడ్‌ పథకాల్లోకి మార్చుకోవాలి. ఇందులో డెట్, ఈక్విటీ పెట్టుబడులు కలిసి ఉంటాయి. నష్టభయమూ కాస్త తక్కువే.
  • సోదరికి ఆర్థిక స్వేచ్ఛ అవసరం గురించి విడమర్చి చెప్పండి. ఇప్పుడు మీరు తన కోసం ప్రారంభించిన పెట్టుబడి దీర్ఘకాలంలో ఎంత విలువైనదో వివరించండి. అత్యవసరమైతే డబ్బు ఎలా తీసుకోవాలో తెలియజేయండి. ప్రతి సందర్భంలోనూ ఆర్థికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తనకు తెలిసి ఉండాలి. కరోనాలాంటి సంక్షోభాలు వచ్చినా ఎదుర్కొనేందుకు ఏం చేయాలన్నదీ తనకు స్పష్టంగా చెప్పాలి.
  • వైవిధ్యమైన పెట్టుబడులు.. అత్యవసర నిధి.. ఆర్థిక ప్రణాళికలో ఇవి రెండూ కీలకం. మీ సోదరికి ఇవి తోడున్నాయా? చూడండి. లేకపోతే.. తన కోసం ఎంతోకొంత అత్యవసర నిధిని జమ చేసి ఇవ్వండి. మరీ అత్యవసరమైనప్పుడు వాడుకునేలా ఆ మొత్తాన్ని తన పేరుమీదే.. తొందరగా నగదుగా మార్చుకునే పెట్టుబడి పథకంలో మదుపు చేయండి.
  • తోబుట్టువుల మధ్య నమ్మకం, ప్రేమ, ఒకరంటే ఒకరికి గౌరవం ఉంటాయి. అంతేకాదు.. ఒకరిపై ఒకరికి బాధ్యతా ఉంటుంది. రాఖీ కట్టిన మీ సోదరికి ఎంత ఖరీదైన వస్తువులు ఇచ్చినా.. కాలం గడుస్తున్న కొద్దీ దాని విలువ, ఉపయోగం రెండూ తగ్గిపోతాయి. వీటివల్ల తాత్కాలికంగా ప్రయోజనమే కలుగుతుంది. దీనికి బదులుగా ఏళ్లు గడుస్తున్న కొద్దీ విలువ పెరిగే, క్రమం తప్పకుండా లాభాలు, రాబడిని అందించే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.

ABOUT THE AUTHOR

...view details