కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఆనకట్టపై నుంచి వరద నీరు పొంగిపొర్లింది. భారీ వరద వస్తుండటంతో 17 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తారు. దిగువన ఉన్న 12 లోతట్టు గ్రామాలకు వరద చేరింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో కడెం జలాశయం పరిస్థితి గంటగంటకూ ఉత్కంఠగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టుల ప్రాంతాల్లోనూ అలజడి నెలకొంది. పోచంపాడు, శ్రీపాద ఎల్లంపల్లి జలాశయాల కింద కూడా ముంపు ఏర్పడుతోంది. దేవాదుల ప్రాజెక్టు మూడోదశలోని సొరంగం, పంప్‌హౌస్, సర్జిపూల్‌ను కూడా వరద తాకింది. మరో రెండు రోజులు భారీ వర్షసూచన ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
కడెం వద్ద ఉత్కంఠ:కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. దీని నీటి మట్టం బుధవారం ఉదయం సమయానికి 699.70 అడుగులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 7.26 టీఎంసీలు కాగా వందశాతం నిండింది. ఎగువ నుంచి వరద పెరుగుతూనే ఉంది. ప్రాజెక్టుకున్న 18 గేట్ల నీటి విడుదల సామర్థ్యం మూడు లక్షల క్యూసెక్కులు. అయితే, ఒక గేటు పూర్తిగా తెరుచుకోలేదు. విడుదల సామర్థ్యం కన్నా వరద ఎక్కువగా ఉండటంతో డ్యాం కట్ట పైనుంచి నీరు పొర్లిపోతోంది. కాల్వలకు కూడా రెండు చోట్ల గండ్లు పడ్డాయి. ఆనకట్ట వద్ద ప్రవాహ గేజ్‌ను కొలిచే గది నుంచి ఇంజినీర్లు కూడా బయటికి వచ్చేశారు. డ్యాం ప్రాంతం వద్ద ఉన్న భారీ సైరన్ మోగించి దిగువ గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. సాయంత్రానికి వరద కొంత తగ్గుముఖం పట్టినా పొద్దుపోయే సమయం నుంచి మళ్లీ పెరిగింది. దిగువన మొత్తం 12 గ్రామాల్లో వరద నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సీఎం కేసీఆర్ కడెం ప్రాజెక్టు పరిస్థితులపై ఎప్పటికప్పుడు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్ చేసి సమీక్షించారు. మంత్రి ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మూడు రోజులుగా కడెం పరీవాహక ప్రాంతంలో కొన్ని చోట్ల దాదాపు యాభై సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది.
దేవాదుల పంపుహౌస్‌లోకి వరద:దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశలోని ప్యాకేజ్ -3లో పంపుహౌస్, సర్జిపూల్‌లోకి వరద నీరు చేరింది. ములుగు జిల్లా రామప్ప చెరువు నుంచి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ వరకు ఈ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆసియాలోనే అతి పొడవైన సొరంగాన్ని జాకారం నుంచి దేవన్నపేట వరకు నిర్మించారు. దేవన్నపేట సమీపంలో నిర్మించిన పంపుహౌస్‌లో 31 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు మోటార్లు ఏర్పాటు చేశారు. మోటార్లకు ముప్పు తప్పినప్పటికీ 49 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగంలోకి వరద నీరు చొచ్చుకొచ్చి.. సర్జిపూల్, పంపుహౌస్‌లోకి ప్రవహించింది. యంత్రాలు, పరికరాలు నీట మునిగాయి.