పోలవరం టెండర్ల రద్దుతోపాటు రివర్స్‌టెండరింగ్ విధానం మంచిది కాదంటూ... గతంలోనే హెచ్చరించిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ... మరోసారి ఘాటుగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం రీ టెండరింగ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో... ఈ విధానం ఊహించని పరిణామాలకు దారితీస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు పీపీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి... నీటిపారుదలశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు లేఖ రాశారు. ప్రిక్లోజర్, రీటెండరింగ్ ఆలోచనలను విరమించుకోవాలని సూచించారు. కేంద్రప్రభుత్వం ఈ అంశంపై ఒక వైఖరి తీసుకునే వరకైనా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో చర్చించిన అంశాలను ఆర్కే జైన్ మరోసారి గుర్తుచేశారు. రీటెండరింగ్ వల్ల ప్రాజెక్ట్ వ్యయం పెరగడంతోపాటు... నిర్మాణ జాప్యం జరుగుతుందన్నారు. ప్రాజెక్ట్ సకాలంలో పూర్తికాకుంటే ప్రయోజనాలు ఆలస్యంగా అందుతాయని పేర్కొన్నారు. ఆలస్యం సామాజికంగా-ఆర్థికంగా ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఈ అంశంపై ఈనెల 13న హైదరాబాద్‌లో చర్చించి ఆందోళన వ్యక్తం చేసిన పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ... 3 రోజుల వ్యవధిలోనే మరో లేఖ రాయడం గమనార్హం.