Demands Vanama Raghava Arrest : పాత పాల్వంచలో మండిగ సూర్యవతి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసాలు ఒకే ప్రాంతంలో ఉన్నాయి. ఇరు కుటుంబాలదీ ఒకే సామాజిక వర్గం. ఆమె కుమారుడు నాగ రామకృష్ణ, కుమార్తె మాధవితో వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావుకు 30 ఏళ్ల క్రితం నుంచి పరిచయాలున్నాయి. ఈ చొరవతో తమ కుటుంబ ఆస్తి వివాదంపై సూర్యవతి ఆయన్ను నెల క్రితం ఆశ్రయించింది. ఏడాదిగా నలుగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని కోరింది. దీంతో ఉమ్మడి ఆస్తి అమ్మగా వచ్చిన సొమ్ము ముగ్గురు (సూర్యవతి, రామకృష్ణ, మాధవి) సమానంగా తీసుకోవాలని పంచాయతీ తేల్చాడు. పైగా తల్లి బాధ్యత కొడుకుగా నువ్వే తీసుకోవాలని రామకృష్ణకు సూచించాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అతడు తానేం చెప్పినా చేస్తాడన్న ధీమాతో బెదిరింపులకూ వెరవలేదు. తాను చెప్పినట్లు (భార్య శ్రీలక్ష్మిని హైదరాబాద్‌లో తన వద్దకు ఏకాంతంగా పంపడం) చేస్తే పరిష్కారం చూపుతానని ఎమ్మెల్యే తనయుడు హూంకరించాడు. ఈ బాధ ఎవరితో చెప్పుకోలేకే కుటుంబ ఆత్మహత్యోదంతానికి బాధితుడు పాల్పడ్డాడు.
ఇంత జరిగినా బెదిరింపులు..
ఈ నెల 3న వేకువజామున జరిగిన దుర్ఘటనలో రామకృష్ణ, భార్య శ్రీలక్ష్మి, పెద్ద కుమార్తె సాహిత్య (12) సజీవ దహనమయ్యారు. 80 శాతానికి పైగా కాలిన గాయాలతో బయటపడి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్న కుమార్తె సాహితి బుధవారం ఉదయం మృతిచెందింది. పట్టణంలోని శ్మశానవాటికలో మధ్యాహ్నం అంత్యక్రియలకు బంధువులు ఏర్పాటు చేస్తున్న సమయంలో మృతురాలి మేనమామ జనార్దన్‌రావు(శ్రీలక్ష్మి అన్న)కు ఎమ్మెల్యే తనయుడి అనుచరులు ఫోన్‌చేశారు. ‘నీది ఈ ఊరు కాదు.. ఈ రాష్ట్రం కాదు.. పెట్టిన కేసు వాపసు తీసుకుని వెళ్లకపోతే నీ చెల్లె, బావకు పట్టిన గతే నీకూ పడుతుందని’ బెదిరించారు. అంత్యక్రియల అనంతరం ఈ విషయమై బాధితుడు పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్‌కు ఫిర్యాదు చేశాడు.
కఠినంగా శిక్షించాలి..
వనమా రాఘవేంద్రరావును కఠినంగా శిక్షించాలని కోరుతూ ‘ఐద్వా’ ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. జిల్లా నాయకురాళ్లు జ్యోతి, లక్ష్మి, ఇందిర, రజిత, సునీత, ప్రియాంక పాల్గొన్నారు. పోలీసులు సత్వరం నిందితుల్ని అరెస్టు చూపాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసాని అయిలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, ఎన్డీ రాష్ట్ర నాయకురాలు చండ్ర అరుణ తదితరులు వేర్వేరు కార్యక్రమాల్లో డిమాండ్ చేశారు.
‘ఆ మాట చెబితే దూరంగా వెళ్లేవాళ్లం..’
నాగ రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోపై తల్లి సూర్యవతి స్పందించారు. తన కుమారుడు ఇంత ఒత్తిడికి లోనయ్యాడన్న సంగతి తెలీదని రోదించారు. ‘ఆస్తి పంపకాల్లో న్యాయం చేయాలని నెల క్రితం రాఘవేంద్రరావు వద్దకు ఇద్దరినీ తీసుకెళ్లా. ఆ సమయంలో అందరితో ఆప్యాయంగానే మాట్లాడాడు. కానీ చాటుగా అంత హీనంగా మాట్లాడిన సంగతి నాతో చెప్పిఉంటే ఆ రోజే అంతా కలిసి రాజమహేంద్రవరం వెళ్లిపోయేవాళ్లం. పరిస్థితులు నెమ్మదించాక ఉన్న ఆస్తులను ఎంతో కొంతకు విక్రయించి కష్టాలు తీర్చుకునే వాళ్లం. అలా చేస్తే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని’ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.