మూడు రాజధానుల ప్రకటనపై నేడు మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనున్న నేపథ్యంలో పోలీసులు అమరావతి ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మంత్రివర్గ భేటీ అనంతరం రాజధానిపై ఏదైనా స్పష్టమైన ప్రకటన వస్తే తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కొద్ది రోజులుగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రిమండలి సమావేశం కోసం సచివాలయానికి వెళ్లే రహదారులు, పరిసర గ్రామాల్లో గురువారమే భారీగా పోలీసు బలగాలను దించారు. ఆయా గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఇప్పటికే అమరావతిలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాజధాని గ్రామాల మీదుగా సచివాలయానికి వెళ్లే ముఖ్యమంత్రి, మంత్రులను అడ్డుకోవటం, అపరిచత వ్యక్తులను నివాసాల్లో ఉంచటం వంటివి చేసినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సచివాలయానికి సమీపంలోని వెలగపూడి, మందడం, మల్కాపురం తదితర గ్రామాల్లో రహదారి వెంబడి ఉన్న ఇళ్లకు... అపరిచత వ్యక్తులను ఇళ్లల్లో ఉంచరాదని నోటీసులిచ్చారు. బందోబస్తు నిర్వాహణపై ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి సచివాలయంలోని గరుడ కమ్యూనికేషన్ సెంటర్‌ను సిద్ధం చేశారు. ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. సచివాలయ పరిసరాల్లో సభలు, సమావేశాలకు అనుమతులు లేవని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. వేల సంఖ్యలో పోలీసులు వచ్చినట్లు సమాచారం. పర్యవేక్షణకు ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రత్యేకంగా రాజధానికి పంపుతున్నారు. ఇప్పటికే గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు రాజధాని ప్రాంతంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
అమరావతిలో భద్రత కట్టుదిట్టం... భారీగా బలగాల మోహరింపు
నేడు మంత్రివర్గ భేటీ జరగనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధానిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున అమరావతిలో భారీగా బలగాలు మోహరించాయి. వేల సంఖ్యలో పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు.
మండలి భేటీ నేపథ్యంలో భారీగా తరలివచ్చిన భద్రతా బలగాలు
Last Updated : Dec 27, 2019, 11:13 AM IST