Murder Case in Banjara Hills పిల్లి విషయంలో మొదలైన వివాదం ఏకంగా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. పిల్లి అరుపులకు చికాకుపడి పక్క గదిలో ఉండే యువకుడిపై కిరోసిన్ పోసి తగులబెట్టేశారు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగింది.
అసలేం జరిగిందంటే: బంజారాహిల్స్ రోడ్ నం.10లోని మిథిలానగర్‌లో నివసించే వ్యాపారి మీనన్ ఇంట్లో... రంగారెడ్డి జిల్లా పాలమాకులకు చెందిన బాలుడు(17) వంట పనుల్లో సాయంగా, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్‌కు చెందిన హరీశ్వర్‌రెడ్డి అలియాస్ చింటు(20) డ్రైవర్‌గా పని చేస్తున్నారు. యజమాని ఇంట్లోనే మొదటి అంతస్తులో ఓ గదిలో వీళ్లిద్దరు ఉంటున్నారు. దాని పక్కనే ఉన్న మరో గదిని అసోంలోని శివసాగర్‌కు చెందిన ఎజాజ్ హుస్సేన్(20), బ్రాన్ స్టిల్లింగ్(20)కు అద్దెకిచ్చారు. వీరిద్దరూ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో కాపలాదారులుగా పని చేస్తున్నారు.