ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో మిలియన్​ మార్చ్​ ఉత్కంఠ, కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు - ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోషియేషన్

CPS హెచ్చరికలు, బెదిరింపులు, ముందస్తు అరెస్టులు, నోటీసులు, ఇంటి నుంచి కాలు బయటకు పెట్టకుండా నిఘా ఇవన్నీ ఉద్యోగుల మిలియన్‌ మార్చ్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు. సెప్టెంబర్ 1 న తలపెట్టిన చలో విజయవాడను భగ్నం చేసేందుకు నిర్బంధకాండ అమలు చేస్తున్నారు. టీచర్లు, సీపీఎస్ సభ్యులు కనిపిస్తే అదుపులోకి తీసుకుంటున్నారు. నోటీసులు జారీ చేసి ఆందోళనల్లో పాల్గొవద్దని గట్టిగా చెబుతున్నారు. కాదని ముందుకు వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

police checking across the state wide
police checking across the state wide

By

Published : Aug 28, 2022, 9:20 PM IST

CPS ISSUE సీపీఎస్​ను రద్దు చేస్తామని ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీని జగన్‌ విస్మరించారంటూ..సెప్టెంబర్ 1 న మిలియన్​ మార్చ్ నిర్వహించి నిరసన తెలపాలని ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోషియేషన్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దృష్టి పెట్టింది. ఇదే సమయంలో 'చలో విజయవాడ'ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీపీఎస్​ సభ్యులు, టీచర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. కొందరిని గృహనిర్భంధం చేస్తున్నారు. ఇప్పటికే పలుకేసుల్లో పేర్లు నమోదై ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న కారణంగా సీఎం నివాసం వద్ద మిలియన్​ మార్చ్‌కు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెక్షన్ 149 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ముందస్తుగా నోటీసులు ఇచ్చి నిఘా పెడుతున్నారు. ముఖ్య నేతలను గృహ నిర్భంధం చేస్తున్నారు. పోలీసుల తీరుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోషియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మిలియన్‌ మార్చ్‌ పిలుపు దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిన పోలీసులు అక్కడ ఉన్న టీచర్లకు నోటీసులు ఇస్తున్నారు. అక్కడ లేకపోతే ఇంటికి వెళ్లి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. అప్పటికే పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటోన్న ఉద్యోగులను పోలీసు స్టేషన్లకు పిలపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. చలో విజయవాడ కోసం కొందరు ఉద్యోగులు ముందుగా వచ్చి తలదాచుకున్నారని అనుమానించిన పోలీసులు ముందస్తుగా విజయవాడలోని లాడ్జీలను.. జల్లెడ పడుతున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాలు, సమీప పట్టణాల్లో లాడ్జీల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అపార్టుమెంట్లలో ఆశ్రయం కల్పించవద్దని ఓనర్లకు, అసోషియేషన్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎవరినైనా గుర్తిస్తే.. వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ మండలాల్లోని సుమారు 550 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పోలీసులు సీఆర్పీసీ 149 కింద నోటీసులు జారీ చేశారు. మిలియన్​ మార్చ్ కు అనుమతి లేదని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మిలియన్​ మార్చ్‌లో పాల్గొనకుండా అనకాపల్లి జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఉద్యోగులను వాహనాల్లో తీసుకెళ్లవద్దంటూ డ్రైవర్ల సంఘాలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో అడిషనల్ ఎస్పీ శివకుమార్ ఆధ్వర్యంలో విజయవాడ వెళ్లే ప్రధాన రహదారులపై ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. ఆధార్ కార్డు పరిశీలించి వాహనదారులను పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పోలీసువారికి సహకరించాలని కోరుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు నోటీసులు జారీ చేశారు.

వైఎస్సార్​ జిల్లాలో 7వేల మందికిపైగా ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఎక్కడ కనబడితే అక్కడ వారికి నోటీసులు అందజేస్తున్నారు. విజయవాడ వెళ్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పోలీసులు నిర్భంధకాండ, ఉద్యోగులు పట్టుదల మధ్య సెప్టెంబర్ 1 న చలో విజయవాడపై ఉత్కంఠ నెలకొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details