అసూయ, ఈర్శ్య 2 నెలల పసికందు ప్రాణాలను తీశాయి. చిన్నారిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లికి తీరని శోకాన్ని మిగిల్చాయి. తనకు కలిగిన బాధ ఇతరులకు కలగాలన్న ద్వేషంతో ఓ మహిళ చేసిన దుశ్చర్య... రెండు కుటుంబాలను దుఃఖ సాగరంలో ముంచింది. పెళ్లైన 12 ఏళ్ల తర్వాత సంతానం కలగగా.. ఆ సంతోషం కొన్ని రోజులైనా నిలవక ముందే అత్త రూపంలోని ఈర్శ్య చిన్నారిని చిదిమేసింది. అప్పటి వరకు తల్లి ఒడిలో ఆదమరిచి నిద్రించిన చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండుతాయని కన్న తల్లి కలలో కూడా ఊహించలేదు. నీకు ఇక పిల్లలు పుట్టరని మరదలితో పరిహాసమాడినందుకు... దాన్ని మనసులో పెట్టుకొని తన మాతృత్వానికే ఎసరు పెడుతుందని గుర్తించలేకపోయింది. పిల్లలు లేని బాధ ఎలా ఉంటుందో తెలిసేలా చేయాలనుకున్న ఓ మహిళ తన ఆడపడుచు కుమారుడిని హత్య చేసింది. హైదరాబాద్ శివారు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అనాజ్‌పూర్‌లో పసికందు హత్యోదంతం వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది.
ఆడపడచు అవమానించిందని..
ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లికి చెందిన తిరుమలేశ్ గౌడ్‌కు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌కు చెందిన లతతో 12ఏళ్ల క్రితం వివాహం కాగా... 2 నెలల క్రితం ప్రసవం అయింది. లత తన బాబుతో కలిసి తల్లిగారింట్లోనే ఉంటుంది. లేకలేక బాబు పుట్టడంతో లత, ఆమె తల్లి ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నారు. ఈ నెల రెండో వారంలో బారసాల చేసి బాబుకు ఉమామహేశ్వర్ అనే పేరు పెట్టారు. లత తమ్ముడు బాల్‌రాజుకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఆయన భార్య శ్వేత గర్భం దాల్చినప్పటికీ రెండు నెలల క్రితం గర్భస్రావమైంది. గర్భస్రావమైన తర్వాత శ్వేతను ఆమె ఆడపడుచు లత అవమానించింది. నీకు థైరాయిడ్ సమస్య ఉంది కాబట్టి... పిల్లలు పుట్టరని పరిహాసమాడింది. దీన్ని మనసులో పెట్టుకున్న శ్వేత.. ఎలాగైనా పిల్లాడిని హతమార్చి, తన కోపాన్ని చల్లార్చుకోవాలనుకుంది. అదును కోసం వేచి చూసింది. ఒకట్రెండు సార్లు పిల్లాడిని చంపేయడానికి ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున హత్యకు పథకం వేసింది. తల్లిపాలు తాగి గాఢనిద్రలోకి వెళ్లిన బాబును తెల్లవారుజామున 3.40నిమిషాల సమయంలో మిద్దెపైకి ఎత్తుకెళ్లి నీళ్ల ట్యాంకులో పడేసింది. బాబు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత కింది వచ్చి.. ఏమీ ఎరుగనట్లు గదిలోకి వెళ్లి నిద్రించింది.