Flood at Polavaram: గోదావరిలో వరద పెరుగుతుండటంతో పోలవరంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మూడేళ్ల క్రితం ప్రారంభించిన దిగువ కాఫర్ డ్యాం పనులు ఇంకా పూర్తికాలేదు. ఈ మూడేళ్లలోనే నిర్మాణానికి అనేక గడువులు మారుతూ వచ్చాయి. 2020 వరద సీజన్ కన్నా ముందే ఈ డ్యాంను పూర్తిచేయాలని అప్పట్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు సూచించినా, ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. జులై వరదల నాటికి దాన్ని 30.5 మీటర్ల స్థాయికి నిర్మించి రక్షిత స్థాయికి తేవాలనుకున్నా.. 19 మీటర్ల స్థాయికే పూర్తి చేయగలిగారు. ఈలోగా గోదావరికి వరద ప్రవాహాలు పెరిగాయి. పోలవరం స్పిల్‌వే వద్ద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో దిగువ కాఫర్ డ్యాంవైపు బ్యాక్‌వాటర్ వేగంగా వస్తోంది. వరద మరింత పెరిగితే దీనిపై నుంచి నీరు ఎగువ కాఫర్ డ్యాంవైపు ఎగదన్నే సమస్య ఉంది. ఈ సవాలును ఎలా ఎదుర్కోవాలా అని అధికారులు మళ్లీ తర్జనభర్జన పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ శనివారం జల వనరులశాఖ, ప్రాజెక్టు అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. స్పిల్ వే గేట్లన్నింటినీ తాత్కాలికంగా మూసి జలాశయంలో నీరు నిల్వ చేయాలని చర్చ జరిగింది. స్పిల్ వే వద్ద 32 మీటర్ల స్థాయికి వరద వచ్చేవరకూ గేట్లు మూసి ఉంచాలని కొందరు ప్రతిపాదించారు.
వరద ఆ స్థాయికి వచ్చేలోపు దిగువ కాఫర్ డ్యాం ఎత్తును మరింత పెంచవచ్చని, అది కొంతమేర రక్షణ ఇస్తుందని ఆలోచించారు. అథారిటీ సమావేశం జరిగే సమయానికి పోలవరం వద్ద 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలే ఉంటాయనే అంచనాతో ఈ ఆలోచన చేశారు. కానీ, సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. ప్రవాహాలు 5 లక్షల క్యూసెక్కులకు చేరుకుంటున్నాయి. పోలవరం స్పిల్‌వే వద్ద వరద 29 మీటర్ల స్థాయికి చేరుకోవచ్చని సమాచారం. గేట్లు మూసేస్తే కొద్దిగంటల్లోనే అది 32, 33 మీటర్ల స్థాయికి చేరుకుంటుందనే అంచనాకు వచ్చారు. దీంతో పోలవరం స్పిల్ వే గేట్లు మూసి, వరదను నిలువరించి దిగువ కాఫర్ డ్యాం వద్ద రక్షణ చర్యలు చేపట్టవచ్చన్న ప్రతిపాదనకు శనివారం సాయంత్రానికే అవకాశం లేకుండా పోయింది.
ఎగువ నుంచి జోరుగా ప్రవాహాలు..:ప్రస్తుతం ఎగువ నుంచి గోదావరిలోకి జోరుగా ప్రవాహాలు వస్తున్నాయి. మేడిగడ్డ వద్ద బ్యారేజి తలుపులు అన్నీ ఎత్తి 4 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని శనివారం దిగువకు వదిలారు. గోదావరి పరీవాహకంలో అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆ వరద అంతా పోలవరానికే చేరుతుంది. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌తో కూడా అధికారులు మాట్లాడారు. ఎగువ నుంచి ప్రవాహాలు ఎక్కువే ఉన్నాయని ఆయన చెప్పడంతో.. పోలవరం స్పిల్ వే గేట్లు తాత్కాలికంగా మూసి పనులు చేయాలనే ఆలోచనకు అవకాశం లేకుండా పోయింది.