పోలవరం ప్రాజెక్టు కింద 1,06,006 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయని, 2011 జనాభా లెక్కల ప్రకారం అందులో 1,64,752 మంది గిరిజనులేనని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడూ తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఒడిశా బీజేడీ సభ్యుడు సస్మిత్ పాత్ర అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘పోలవరం ప్రాజెక్టు అథారిటీతోపాటు కేంద్ర జల్‌శక్తి శాఖ, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌లో 1,06,006 కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇందులో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 56,504 కుటుంబాలు, 1,64,752 మంది వ్యక్తులు గిరిజనులే. ప్రస్తుతం సామాజిక, ఆర్థిక సర్వే చింతూరు, యటపాక యూనిట్లలో +45 కాంటూర్ వరకే పూర్తయినందున ఈ నిర్వాసిత కుటుంబాల లెక్క తాత్కాలికమే. సహాయ, పునరావాస పథకాలకు ఆమోదముద్ర లభించిన తర్వాత ఈ నిర్వాసిత కుటుంబాల సంఖ్య ఖరారవుతుంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల్లో పోలవరం వల్ల ముంపు తలెత్తకుండా రక్షణ గోడల నిర్మాణాన్ని తలపెట్టినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పింది. ఆ గోడలు నిర్మించకపోతే ఒడిశాలో 1,002 (913 గిరిజన), ఛత్తీస్‌గఢ్‌లో 2,335 (1,294 గిరిజన) కుటుంబాలు ప్రభావితమవుతాయి. ముంపునకు గురయ్యే గిరిజన కుటుంబాలకు పరిహారంగా భూమికి భూమి లేదా రెండున్నర ఎకరాలు (ఇందులో ఏది తక్కువైతే అది) అందిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. గిరిజన తెగల వారికి షెడ్యూల్డ్ ప్రాంతాల్లోనే పునరావాసం కల్పించామంది. ముంపు బాధితులకు 2013 భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం రూ.6.86 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలిపింది. నిరుద్యోగ యువత జీవనోపాధి కోసం నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లూ పేర్కొంది’ అని వివరించారు.
రూ.64 వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం... రాజ్యసభలో వెల్లడించిన కేంద్రమంత్రి గడ్కరీ
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి ఇప్పటివరకు రూ.64,684 కోట్లతో 149 జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. బుధవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇందులో ఇప్పటివరకు రూ.22,556 కోట్ల విలువైన 66 పనులు పూర్తయినట్లు చెప్పారు. రూ.27,800 కోట్ల విలువైన 62 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రూ.14,328 కోట్ల విలువైన 21 పనులను ఇటీవలే అప్పగించినట్లు వెల్లడించారు. 2014 మే నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 6,590 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉండగా, 2022 జనవరి నాటికి అది 8,207 కిలోమీటర్లకు చేరినట్లు ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
భారత్‌మాల పరియోజన కింద ఏపీలో 36, తెలంగాణలో 17 ప్రాజెక్టులు
భారత్‌మాల పరియోజన కింద దేశవ్యాప్తంగా ఆదర్శవంతమైన రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘దీనికింద ఆంధ్రప్రదేశ్‌లో 1,409.13 కిలోమీటర్ల పొడవైన 36 ప్రాజెక్టులు చేపట్టగా ఇప్పటివరకు 879.15 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. మిగతా వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. తెలంగాణలో 969.41 కిలోమీటర్ల పొడవైన 17 ప్రాజెక్టులు చేపట్టాం. అందులో 730.59 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది’’ అని తెలిపారు. భారత్‌మాల ఫేజ్-1 కింద బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని బంగారుపాలెం-గుడిపాల మధ్య రూ.1,138 కోట్లతో రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు వైకాపా సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ అడిగిన మరో ప్రశ్నలకు గడ్కరీ సమాధానమిచ్చారు. 24 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తిచేసేలా గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ పనులను అప్పగించినట్లు తెలిపారు. భారత్‌మాల-1 కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.30,551 కోట్ల విలువైన 857 కిలోమీటర్ల ప్రాజెక్టులు మంజూరుచేయగా, అందులో 311 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
ఏపీలో మూడు జాతీయ విద్యాసంస్థలకు శాశ్వత ప్రాంగణాలు: కేంద్రం
రాష్ట్ర విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 7 ఉన్నత విద్యాసంస్థల్లో మూడింటి శాశ్వత ప్రాంగణాల నిర్మాణం ఈ ఏడాది చివరికి పూర్తవుతుందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. బుధవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘తాడేపల్ల్లిగూడెంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) నిర్మాణం రూ.533 కోట్లతో పూర్తయింది. తిరుపతి ఐఐటీ ఈ ఏడాది నవంబర్, వైజాగ్ ఐఐఎం మొదటి దశ సెప్టెంబర్, కర్నూలు ట్రిపుల్‌ఐటీ(డీఎం) నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. ఈ మూడు సంస్థలకు మొత్తం రూ.1,816 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేశాం. తిరుపతి ఐఐఎస్‌ఈఆర్ నిర్మాణం 2023 జూన్ నాటికి పూర్తవుతుంది. దాని నిర్మాణానికి రూ.1,491.34 కోట్లు కేటాయించగా, రూ.417.13 కోట్లు విడుదల చేశాం. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీ నిర్మాణానికి బృహత్‌ప్రణాళిక ఖరారైంది. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి స్థల ఎంపిక కమిటీ విజయనగరం జిల్లాలో స్థలాన్ని ఖరారు చేసింది. దాన్ని బదిలీ చేయాలని నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది’ అని వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలి : తెదేపా ఎంపీ కనకమేడల డిమాండ్
తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన బుధవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశంపై మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మాదిగ, రెల్లి కులాలు చాలా వెనుకబడి ఉన్నాయి. విభజన లేకపోవడం వల్ల ఎస్సీల్లో కేవలం కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్లు పొందుతున్నాయి. మిగతా కులాలు ఆ ఫలాలను అందుకోలేకపోతున్నాయి. విద్య, ఉద్యోగాల్లో అసమానతలు పెరిగిపోతున్నాయి. ఈ సమస్యను చట్ట సవరణ ద్వారా పరిష్కరించాలి. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ కూడా వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. కేంద్రం స్పందించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చర్యలు తీసుకోవాలి...’’ అని ఆయన కోరారు.