పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు విషయంలో ప్రభుత్వం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి రామారావుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జులై 31న జారీచేసిన గెజిట్ ప్రకటనలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని, వాటి అమలుపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి తదితరులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. రాజ్ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం, వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలు, పోలీసు శాఖ కార్యాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు.
నిపుణుల కమిటీ, ఉన్నతస్థాయి కమిటీ నివేదికలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. అమరావతి నుంచి రాజధానిని మార్చేసి 3 రాజధానులు ఏర్పాటు చేసేందుకు శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలన్నారు. సీఆర్‌డీఏ బృహత్తర ప్రణాళికను అమలు చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం హైకోర్టుకు సెలవు అయినందున.. మంగళవారం ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని అభ్యర్థించనున్నట్లు సమాచారం.