మూడు రాజధానుల మాటపై గుంటూరు జిల్లా మేడికొండూరులోని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. ఒకే రాష్ట్రం...ఒకే రాజధాని ఉండాలంటూ నినాదాలు చేశారు. ప్రాణాలైనా ఇచ్చి అమరావతిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వరుసగా 9వ రోజు నిరసనలు మిన్నంటాయి. వందలాది మంది రైతులు, కూలీలు, మహిళలు ధర్నాలో పాల్గొని తమ నిరసన ప్రకటించారు. తుళ్లూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు, మహిళలు తరలిరావటంతో ధర్నా శిబిరం కిటకిటలాడింది. క్రిస్మస్ వేడుకలను సైతం రహదారిపైనే చేపట్టారు. ఏసుక్రీస్తు ప్రభువు...... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలంటూ కాగడాలు, కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
స్పదించకుంటే ఉద్ధృతం
గుంటూరు జిల్లా పెదనందిపాడులో రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. గుంటూరు పర్చూరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం అమరావతి విషయంలో సానుకూలంగా స్పందించకపోతే పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
నరసరావుపేటలో తెదేపా ఆధ్వర్యంలో అన్ని వామపక్షాలు కలసి నూతన అఖిలపక్షం ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అమరావతి రైతులకు పూర్తి మద్దతు ప్రకటించారు. పూర్తి స్థాయి రాజధాని అమరావతి అని ప్రకటించేంత వరకూ జేఏసీ పోరు ఆగదని స్పష్టం చేశారు. రాజధాని రైతులకు తెదేపా అండగా ఉంటుందని పార్టీ నాయకుడు వేగేశ్న నరేంద్ర వర్మ బాపట్లలో తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదని అన్నారు. ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వాలు నడుచుకోవాలని హితవు పలికారు.