రాష్ట్రంలో వారం రోజుల నుంచి ఎండలు మండుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీనికితోడు వాతావరణంలో తేమశాతం అధికంగా ఉండటంతో.. పలు ప్రాంతాల్లో ఉక్కపోత ప్రభావమూ ఎక్కువగానే ఉంది. దీంతో శరీరం చెమటలు కక్కుతోంది. వాతావరణ మార్పులతో ఆరోగ్యంపైనా ప్రభావం పడుతోంది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరులో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంటాయి. దీంతో వాతావరణం చల్లబడుతుంది. గత వారం రోజులుగా ఈ పరిస్థితులు లేకపోవడంతో ఎండల తీవ్రత పెరిగింది. మరో రెండు రోజుల పాటు ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంది. తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై బలహీనంగా ఉంది. దీంతో ఎండల తీవ్రత అధికమైంది. కోస్తాలో మరింత ఎక్కువగా కన్పిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 4.5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. సోమవారం తునిలో అత్యధికంగా 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సెప్టెంబరు 1న పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వాతావరణంలో తేమ శాతం పెరిగింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 65% నుంచి 80% వరకు నమోదవుతోంది. కళింగపట్నం, గన్నవరం, జంగమహేశ్వరపురం, విశాఖపట్నం, బాపట్ల, తుని, నందిగామ, తదితర ప్రాంతాల్లో 70% పైనే ఉంది. దీంతో ఉక్కపోత పరిస్థితులు అధికంగా ఉన్నాయి.
అల్పపీడనానికి అవకాశం..