ఎటుచూసినా భక్తజనం. చుట్టూ లింగ నామస్మరణలు. గజ్జెల చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలతో పెద్దగట్టంతా మార్మోగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే దేవరకు మొక్కులు చెల్లించుకునేందుకు మునుపెన్నడూ లేని విధంగా భక్తజనం తరలివస్తోంది. చౌడమ్మతల్లికి మొక్కులు చెల్లించి... గండదీపాలతో లింగమంతుడికి భక్తులు నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు పెద్దగా రద్దీ లేకున్నా... ఆ తర్వాత క్రమంగా జనం రాక మొదలైంది. దేవరపెట్టెకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం... పసుపు, కుంకుమలతో యాదవ హక్కుదారుల సంప్రదాయానుసారం చంద్రపట్నం కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
- సందడిగా మారిన ఆలయ పరిసరాలు
వేలమంది భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఎగ్జిబిషన్‌గ్రౌండ్, దుకాణాల వద్ద వివిధ వస్తువులు కొనుగోలు, ఆటాపాటలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. జాతర నిర్వహణలో భాగంగా శిబిరాల వద్ద అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున... మరిన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉండాల్సిందని భక్తులు చెబుతున్నారు. గతానికన్నా భిన్నంగా ఈసారి... లడ్డూల ధరలు మరీ ఎక్కువగా పెంచారని అభిప్రాయపడ్డారు. మరోవైపు మహిళలకు పెద్దగా వసతులు కల్పించలేదని... పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం విషయంలోనూ ఏర్పాట్లు నాసిరకంగా ఉన్నాయన్నారు.
- ట్రాఫిక్ ఆంక్షలు