ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ధర్మాన్ని పరిరక్షిద్దాం–మత సామరస్యాన్ని కాపాడుకుందాం'

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ... సనాతన ధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.... తన వ్యవసాయక్షేత్రంలో సంధ్యా దీపం వెలిగించారు. ధర్మాన్ని పరిరక్షిద్దాం–మత సామరస్యాన్ని కాపాడుకుందాం అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు. ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అందరూ అడుగులు వేయాలని ఆకాంక్షించారు.

By

Published : Sep 12, 2020, 1:04 AM IST

పవన్‌కల్యాణ్‌
పవన్‌కల్యాణ్‌

అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ తరపున స్వాగతిస్తున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడం అంటే సమస్య పరిష్కారం అయినట్లు కాదని, నిందితుల్ని పట్టుకోవటానికి వేసిన తొలి అడుగు మాత్రమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏ మతస్థుల మనోభావాలు దెబ్బతినేలా దుశ్చర్యలు జరగకూడదని జనసేన కోరుకుంటోందన్నారు.

అంతర్వేదిలో అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సీబీఐ పరిమితం కారాదని... పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సీబీఐ నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేది ఆలయ భూములతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయాయని... వీటి గురించీ సీబీఐ ఆరా తీసి దేవదాయశాఖ ఆస్తులకు రక్షణ ఇవ్వాలని కోరారు.

తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సీబీఐ విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ పింక్ డైమండ్ ఏమైపోయిందనే అంశంపై రమణ దీక్షితులు గత ప్రభుత్వ హయాంలోనే సంచలన విషయాలు చెప్పారని... తిరుమల శ్రీవారికి, శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాల గురించీ దర్యాప్తు చేయాలన్నారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 9,999 కరోనా కేసులు, 77 మరణాలు

ABOUT THE AUTHOR

...view details