ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెంకయ్య మాటలు స్ఫూర్తినిస్తాయి : పవన్ కల్యాణ్

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాటలు స్ఫూర్తినిస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు సంపాదించిన వెంకయ్య.. పార్టీ పదవి అయినా.. రాజ్యాంగ పదవి అయినా.. ఆ పదవులకే వన్నె తెచ్చారని కొనియాడారు.

pawan on venkaiah
pawan on venkaiah

By

Published : Aug 9, 2022, 7:32 PM IST

"విశ్రాంతి తీసుకుంటే నాకు అలసట కలుగుతుంది" అన్న వెంకయ్య నాయుడి మాటలు స్పూర్తిదాయకమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో.. వెంకయ్య చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ చైతన్యపరుస్తాయన్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించి.. అత్యవసర పరిస్థితిని ఎదిరించి.. ఆరు నెలలపాటు జైలు జీవితం అనుభవించి.. ఉపరాష్ట్రపతి పదవి వరకు ఆయన సాగించిన సుదీర్ఘ రాజకీయ ప్రయాణం అనన్యసామాన్యమని అన్నారు.

ఎన్నో మలుపులు, మరెన్నో అనుభూతులు ఎదుర్కొన్న రాజకీయ బాటసారి వెంకయ్య అని కొనియాడారు. ఆయన రాజకీయ మేధావిగా.. శాసనసభ, రాజ్యసభల్లో ఆయన చేసిన ప్రసంగాలు ప్రతీ ఒక్కరిని ఆలోచింపచేశాయన్నారు. రాజ్యసభ ఛైర్మన్ గా వెంకయ్య సభను నడిపిన తీరు బహుదా ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి కంటే.. ఉషాపతిగా ఉండడమే తనకు ఆనందమన్న వెంకయ్య చమత్కారాలు, భాషా విరుపులు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయని చెప్పారు పవన్.

పార్టీ పదవైనా.. రాజ్యాంగ పదవైనా వాటికి వన్నెలు దిద్దడం వెంకయ్యకు.. వెన్నతో పెట్టిన విద్య అని కొనియాడారు. తాను వెంకయ్యను అరుదుగానే కలిసినప్పటికీ.. కలిసిన ప్రతిసారీ ఆయన ఇచ్చే సలహాలు తన రాజకీయ ప్రయాణానికి ఉపయుక్తంగా ఉంటాయన్నారు. వెంకయ్య నాయుడు తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారికి గర్వకారణమన్నారు. ఆయనకు భగవంతుడు సుసంపన్నమైన ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details