అమరావతి రైతులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. వారి కోసం తన ప్రాణాలను అడ్డు వేస్తానని ధైర్యం చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కోసం ఎవరితో అయినా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మంగళగిరిలోని కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన ఆయన... అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాజధానిపై అన్ని ప్రాంతాల నేతల అభిప్రాయాలు తీసుకున్నామని... ఈ అంశంపై సబ్ కమిటీ ఏర్పాటు చేశామని పవన్ తెలిపారు. పాలకులు చేసిన తప్పులు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన గాయం మానకముందే... ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే భావితరాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని హెచ్చరించారు.
రైతులు కన్నీరు పెడితే పోరాటం చేస్తా..
అమరావతిని రాజధానిగా అన్ని పార్టీలు గతంలో ఒప్పుకున్నాయని పవన్ గుర్తుచేశారు. అంచెలంచెలుగా రాజధాని నగరం నిర్మించుకోవచ్చని వివరించారు. అమరావతికి భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు ఇష్టపడకపోతే... వారి కన్నీటితో రాజధాని నిర్మించవద్దని ఆనాడు ప్రభుత్వానికి చెప్పానని వెల్లడించారు. రైతులు కన్నీరు పెడితే పోరాటం చేస్తానని అప్పుడే స్పష్టంగా చెప్పిన విషయం గుర్తుచేశారు.