ట్రాలీఆటోలో క్రీడాకారుల తరలింపు... - POLICE
క్రీడాశాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. బస్‌లో తరలించాల్సిన క్రీడాకారులను ట్రాలీ ఆటోలో ఎక్కించారు. మధ్యలో ట్రాఫిక్ పోలీసులు ఆపి పిల్లలను దించేశారు. పిల్లలను ట్రాలీ ఆటోలో తరలించడం తప్పన్న పోలీసులపై ఆటో డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు.
అంతర్ జిల్లాల కబడ్డీ క్రీడాకారుల తరలింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో క్రీడాకారులను ట్రాలీ ఆటోలో తరలిస్తుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లి వద్ద అధిక లోడ్‌తో వెళ్తున్న ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ ఆటోలో సుమారు 50 మంది పిల్లలను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలను ట్రాలీ ఆటోలో తరలించడంపై డ్రైవర్‌ను మందలించారు. నిబందనలకు విరుద్దంగా వాహనం నడపటంపై పోలీసులకు, ఆటో డ్రైవర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు.. విద్యాశాఖ అధికారులకు మరోసారి ఇలా ట్రాలీలో పిల్లలను తరలించవద్దని సూచించారు.