పంటల సాగుకు కూలీల సమస్య తీవ్రంగా ఉంది.. భూమి దున్నటం మొదలు పంట నూర్పిడి వరకు యంత్రాల వినియోగం లేకుండా రైతుకు సాగు సాధ్యం కావడం లేదు. ఉపాధి పథకం అమలుతో వ్యవసాయ కూలీలకు డిమాండు పెరిగింది. అనాధిగా వస్తున్న ఎడ్ల సేద్యం ఏటికేడు కనుమరుగవుతూ వస్తోంది. ఈక్రమంలో యాంత్రీకరణ ప్రాధాన్యతగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలుపై రైతులకు పెద్దఎత్తున రాయితీలు ఇచ్చాయి. కానీ రాష్ట్రంలో ఏడాదిన్నరగా రాయితీ పథకం అటకెక్కింది. వ్యక్తిగత పరికరం లేనట్టేపంటల సాగులో కూలీల సమస్యకు పరిష్కారంగా గతంలో ప్రభుత్వాలు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేశాయి. ఏటా ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించేది. రైతులు వ్యక్తిగతంగా కొనుగోలు చేసే యంత్రాలపై 50 శాతం రాయితీ ఇచ్చేది. ట్రాక్టర్లు, టార్పాలిన్లు, మందు పిచికారీ స్ప్రేయర్లు, విత్తన గొర్రు, పంట నూర్పిడి యంత్రాలు, కాడెద్దులతో సేద్యం చేసే పరికరాలు, ట్రాక్టర్‌కు అమర్చి పరికరాలు ఇలా అనేకం రాయితీపై సరఫరా అయ్యేవి. ఈ పథకానికి రెండేళ్లుగా నిధుల కేటాయింపులేదు. వ్యక్తిగతంగా రాయితీ పరికరాలిచ్చే పథకం స్థానంలో అద్దెకిచ్చే కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
అద్దె కేంద్రాలు అంతంతే..
వ్యక్తిగత రాయితీ పథకాన్ని నిలిపేసిన ప్రభుత్వం రైతు భరోసా కేంద్రంలో కస్టమ్ హైరింగ్ (అద్దెకిచ్చే) పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. ప్రతి ఆర్బీకేలో రూ.15 లక్షల విలువచేసే పలు యంత్రాలు అందుబాటులో ఉంచి, రైతులు అద్దెకు తీసుకోవచ్చని అధికారులు ప్రచారం చేశారు. రైతులు బృందంగా ఏర్పడి అద్దె కేంద్రాలు ఏర్పాటు చేస్తే రూ.15 లక్షల పథకానికి 40 శాతం రాయితీగా ఇస్తామని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 859 రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అయితే యంత్రాల జాబితా నుంచి ట్రాక్టర్‌ను తొలగించడంతో రైతులు ముందుకు రాలేదు. దీంతో కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదన సాగడంలేదు.