టాలీవుడ్ డ్రగ్స్ కేసులో (Tollywood Drugs Case).. సినీ ప్రముఖులపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో కెల్విన్‌పై ఛార్జ్‌షీట్ (Chargesheet on kelvin) దాఖలు చేసిన ఎక్సైజ్ శాఖ.. నటుల విచారణను ప్రస్తావించింది. కెల్విన్‌కు మంగళూరులో చదువుకునేటప్పట్నుంచి డ్రగ్స్ అలవాటు ఉందని.. 2013 నుంచి మిత్రులకు డ్రగ్స్ విక్రయించేవాడని ఎక్సైజ్ శాఖ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. గోవా, విదేశాల నుంచి డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్ తెప్పించాడని.. వాట్సాప్, మెయిల్ ద్వారా ఆర్డర్లు తీసుకొని డ్రగ్స్ సరఫరా చేశాడని వివరించింది.
చిరునామాలు, ఇతర కీలక వివరాలు దర్యాప్తులో కెల్విన్ వెల్లడించలేదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కెల్విన్, అతని స్నేహితులు నిశ్చయ్, రవికిరణ్ ప్రమేయంపై ఆధారాలున్నాయని ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. సోదాల సందర్భంగా కెల్విన్ వంటగది నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని ఎక్సైజ్‌శాఖ వెల్లడించింది. సెలబ్రిటీలపై బలమైన, తగిన ఆధారాలు లభించలేదని తెలిపింది. సినీ ప్రముఖులపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవన్న ఎక్సైజ్ శాఖ.. నటులపై కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉందని పేర్కొంది.