ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

No Humanity: అమ్మకు చోటివ్వలేదు... ఇదేనా పట్టణ సంస్కృతి!?

ఆ మెట్రో రైలు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. అప్పుడే ఓ మహిళ తన శిశువుతో కలిసి మెట్రో రైలు ఎక్కింది. ఎక్కడా ఒక్క సీటు కూడా దొరకలేదు. గమ్యం చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. ఆమె పడుతున్న ఇబ్బందిని ఎవరూ గుర్తించలేదు. ఇంకా తప్పదని తెలిసిన ఆ తల్లి... శిశువుతో కలిసి అక్కడే కింద కూర్చొని గమ్యం చేరే వరకు ప్రయాణించింది.

No Humanity
No Humanity

By

Published : Oct 26, 2021, 10:14 AM IST

నిజమే ఓ సినీ రచయిత అన్నట్లు.. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ ఉండరేమో! ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా బిడ్డను లోకంలోకి తీసుకొస్తుంది అమ్మ. వారిని చూడగానే ప్రసవ వేదనను మరిచి.. సంతోషంలో మునిగి తేలుతుంది. ఏ పని చేసినా.. తన బిడ్డే అందరి కంటే ఉత్తమం అనుకుంటుంది. జీవితంలో కచ్చితంగా ఏదో సాధిస్తాడని నమ్ముతుంది. వారి బంగారు భవిష్యత్ కోసం నిరంతరం శ్రమిస్తుంది.

ఒడిలో పసికందుతో మెట్రోరైలు ఎక్కిందా మహిళ. అప్పటికే సీట్లన్నీ నిండిపోయాయి. అక్కడ కూర్చున్న వారిలో యువతులు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. చేతుల్లో శిశువుతో ఉన్న ఆ అమ్మను.. చూసీ చూడనట్టుగా ఉండిపోయారు. కదిలే రైలులో పసిబిడ్డతో ఆ అమ్మ ఎక్కువసేపు నిలబడలేకపోయింది. కింద కూర్చుని.. ఒళ్లో బిడ్డను ఉంచుకుని గమ్యం వరకూ ప్రయాణించింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ మెట్రోలో జరిగిన సంఘటనను ఎవరో వీడియోతీసి ‘గ్రేట్‌ ఎడ్యుకేటెడ్‌ ఉమెన్‌ ఇన్‌ హైదరాబాద్‌’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

సామాజిక విలువలు ఏమయ్యాయి..?

గర్భిణులు.. చంటిపిల్లలతో ఉన్న మహిళలు కనిపించగానే కూర్చున్న సీటును ఇవ్వటం సాధారణంగా చూస్తుంటాం. మెట్రోరైలులో అక్కడ ఉన్న ఏ ఒక్కరూ స్పందించకపోవటం.. బాలింత అనే కనికరం చూపకపోవటంపై నెటిజన్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంత పెద్దచదువులు పూర్తిచేసిన మహిళలు.. కనీస మానవత్వం చూపకపోవటం దారుణమంటున్నారు. మెట్రోరైలులో జరిగిన ఘటనపై హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి స్పందించారు. ఇది బాధాకరం. తోటి ప్రయాణికులు సీటిచ్చి సహకరించాల్సి ఉంది. అలా చేయకపోవటం బాధగా అనిపించింది. మనం కట్టుబడి ఉన్న సామాజిక విలువలను ప్రశ్నించేదిగా ఉంది.

పసికందును భద్రంగా పట్టుకుని కిందకూర్చుని ప్రయాణించిన ఆమెలో నిజమైన భారతీయ మాతృ హృదయ గొప్పతనం కనిపించింది. పదినెలలు మోసిన పిల్లలను జీవితాంతం మోయడానికి ఏ తల్లి కూడా ఇబ్బంది పడదు అని మరోసారి రుజువు చేసింది. అందరూ చూస్తున్నారని... ఏ మాత్రం ఇబ్బంది పడకుండా... కింద అయితే ఏంటి? పైన అయితే ఏంటి? బిడ్డను జాగ్రత్తగా తీసుకెళ్లాలనే తపనే ఆమెలో ఉంది. ఎంత మందిలో ఉన్నా ఎలాంటి పరిస్థితులల్లో అయినా తల్లి తన బిడ్డలకు ఎప్పుడు రక్షగానే ఉంటుందనేందుకు ఇలాంటి ఘటనలే నిదర్శనాలు.

ఇదీ చూడండి:

ఇతరులపైనే ఆధారం..భవిష్యత్​ అగమ్యగోచరం

ABOUT THE AUTHOR

...view details