Kaleshwaram Project loans : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన రుణంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇదే పరిస్థితి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచే ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. మొదట కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం రుణం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా, తాజాగా ఆర్బీఐ, కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరగాలని రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ (ఆర్.ఇ.సి) స్పష్టం చేసింది. దీంతో ఇక అప్పువచ్చే అవకాశం తక్కువేనన్న అభిప్రాయాన్ని నీటిపారుదల శాఖ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి.
అదనపు టీఎంసీ పనులపై పడనున్న ప్రభావం :కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా అదనపు టీఎంసీ నీటిని మళ్లించే పనికి అవసరమైన నిధుల కోసం ఆర్.ఇ.సి.తో కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. 2019 జులై 13న రూ.18 వేల కోట్లు, 2020 జూన్ నాలుగున మరో రూ.11 వేల కోట్లు కలిపి మొత్తం రూ.29 వేల కోట్ల రుణం ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇప్పటివరకు రూ.12,700 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో కాళేశ్వరం కార్పొరేషన్, ఆర్.ఇ.సి మధ్య జరిగిన ఒప్పందం కాకుండా రిజర్వ్‌బ్యాంకు, కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరగాలని ఆర్.ఇ.సి కోరింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. సందిగ్ధత కొనసాగితే రాష్ట్ర ఖజానాపైనే భారం :ఒప్పందం జరిగి కొంతమేరకు నిధులు విడుదల చేసిన తర్వాత ఇలాంటి నిబంధన పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. దీనిపై ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం తప్ప రుణానికి సంబంధించి అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో ఇక రుణం వచ్చే అవకాశం తక్కువేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై కూడా నీటిపారుదల శాఖ చర్చించింది. రుణం విడుదలలో జాప్యం కావడం, రాష్ట్ర ఖజనా నుంచి పూర్తి స్థాయిలో చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆ ప్రభావం పనులపై పడే అవకాశం ఉంది.