admissions closed in govt school: విద్యలో నాణ్యత ఉండాలే గాని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కడతారు. ఈ మాటను అక్షరాల నిజం చేస్తుంది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని ప్రభుత్వపాఠశాల. పట్టణంలోని పన్నాల వెంకటరాంరెడ్డి, ఇందుమణెమ్మ స్మారక ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గంజ్ హైస్కూల్)కు మొదటి నుంచి ఎంతో పేరొందింది. గతేడాది నుంచి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రారంభమైంది. ఈ ఏడాదికి 7,8,9,10 తరగతులకు ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లు ముగిశాయని ఇటీవల ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో ఆరో తరగతి విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇస్తామని, ఇతర తరగతుల విద్యార్థులకు ప్రవేశం కల్పించలేమని హెడ్మాస్టర్ ప్రభాకర్ తెలిపారు. తెలుగు మీడియంలో మాత్రం అన్ని తరగతులకు ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. పాఠశాలలో స్థలాభావం వల్ల ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ మందిని తీసుకోలేకపోతున్నామని ఆయన తెలిపారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం వల్ల మాకు అడ్మిషన్స్ విరివిగా వస్తున్నాయి. రెండు మాధ్యమాల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నాం. మాకు అడ్మిషన్స్ ఓవర్గా వస్తున్నాయి. ప్లేస్ సరిపోవడం లేదు. ఇతర క్లాసుల్లో తెలుగు మీడియంలో సీట్లు ఉన్నాయి. కానీ ఆంగ్ల మాధ్యమంలో సీట్లు నిండిపోయాయి. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మాకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు.
- ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు, భువనగిరి గంజ్ హైస్కూల్