NATIONAL COMMISSION FOR WOMEN : శ్రీకాళహస్తి సీఐ అంజుయాదవ్ హోటల్ నిర్వాహకురాలు ధనలక్ష్మిపై దురుసుగా ప్రవర్తించడాన్ని జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఏపీలో పోలీసుల అరాచకాలు పెరిగిపోతున్నాయంటూ.. జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మకు తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రేఖా శర్మ.. ధనలక్ష్మిపై దాడి చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని.. డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు డీజీపీకి లేఖ రాశారు. మొత్తం వ్యవహారంపై.. కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని.. జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. మరోవైపు సీఐ అంజు యాదవ్‌ను తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ విమల కుమారి వరుసగా రెండో రోజూ ప్రశ్నించారు. సాక్షులెవరైనా ముందుకు వస్తే వారి వాంగ్మూలం కూడా తీసుకుంటామన్న ఆమె.. 15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి.. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతానని వివరించారు.
ఇదీ జరిగింది: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ హోటల్ నిర్వాహరాలిపై సీఐ అంజూ యాదవ్ దురుసుగా ప్రవర్తించారు. అక్టోబర్ 1న రాత్రి 10 గంటలకు హోటల్ మూత వేయడం లేదని.. ధనలక్ష్మిపై సీఐ దాడికి దిగారు. రోడ్డుపైనే బలవంతంగా ఈడ్చుకుంటూ వాహనంలో ఎక్కించుకుని స్టేషన్ తరలించారు. బాధితురాలు తనకి ఇటీవలే ఆపరేషన్ అయ్యిందన్నా.. సీఐ అంజూ యాదవ్ వినిపించుకోలేదు. నెల వారి మామూలు ఇవ్వలేదనే.. అక్కసుతోనే తన భార్యపై సీఐ దాడికి దిగిందని హోటల్ నిర్వహకురాలి భర్త ఆరోపించారు. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. దురుసుగా ప్రవర్తించిన అధికారిణి తీరును ఖండించారు. సీఐ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు.