ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట: చంద్రబాబు

అమరావతి పోరాటానికి అల్లూరి ఆదర్శమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 200 రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి అభినందనలు తెలిపారు. రాజధాని తరలించేందుకు వైకాపా అబద్ధపు కారణాలన్నీ చెప్పిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు నిర్మిస్తారా అని ప్రశ్నించారు. ప్రాచీన చరిత్ర కలిగిన అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా మార్చాలనుకున్నామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి నడిబొడ్డున, అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో రాజధాని నిర్మించాలనుకున్నామని స్పష్టం చేశారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : Jul 4, 2020, 12:23 PM IST

Updated : Jul 4, 2020, 12:39 PM IST

ప్రజారాజధాని వస్తే తమ బతుకులు బాగుపడతాయని అమరావతి రైతులు భావించారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి రైతుల ఆందోళన 200వ రోజులు చేరిన సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. అమరావతి కోసం పోరాడుతున్న అందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు. అమరావతి ఉద్యమానికి అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి ఆదర్శంకావాలన్నారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు చంద్రబాబు నివాళులు అర్పించారు.

రాజధాని తరలించేందుకు వైకాపా ప్రభుత్వం అడవలసిన నాటకాలన్నీ ఆడింది. ముంపు ప్రాంతం అంది, ఇన్​సైడర్​ ట్రైడింగ్ ఆరోపణలు చేసింది. ఓ కులం వాళ్లే ఉన్నారని విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నించింది. అమరావతి కోసం పోరాడుతున్న శివారెడ్డి, శాస్త్రి ఏ కులమని ప్రశ్నిస్తున్నా?----చంద్రబాబు, తెదేపా జాతీయ అధ్యక్షుడు

రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని

అమరావతికి ప్రాచీన చరిత్ర ఉందన్న చంద్రబాబు.. ప్రపంచం మెచ్చుకునే రాజధాని నిర్మించాలనుకోవటం తప్పా అని ప్రశ్నించారు. అమరావతి ఏ పార్టీదో, వ్యక్తిదో కాదన్న ఆయన...13 జిల్లాలకు నడిబొడ్డున అమరావతి నిర్మాణం తలపెట్టామని గుర్తుచేశారు. అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారన్నారు.

9 వేల కోట్లు ఖర్చు చేశాం

అమరావతి కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ఇంకా అమరావతికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. అమరావతిలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్ పూర్తి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోలు, గ్రూప్‌-డి ఉద్యోగుల భవనాల నిర్మాణాలు చేపట్టామన్నారు.

'అధికారంలోకి రాకముందు జగన్​ స్వయంగా ఒప్పుకున్నారు అమరావతి రాజధానికి అనువైన ప్రాంతమని, ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధానులు నిర్మిస్తారా?' అని చంద్రబాబు విమర్శించారు.

దిల్లీ కన్నా దీటైన నగరం

అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వారిపై అనేక కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. మహిళలు, రైతులను అనేక ఇబ్బందులు పెట్టారన్న ఆయన.. అమరావతి గ్రామాల్లో మానవహక్కులు ఉల్లంఘించారని పేర్కొన్నారు. అమరావతి స్థలబలం చాలా గొప్పదన్న చంద్రబాబు.. దానికితోడు సంకల్ప బలం ఉందన్నారు. అమరావతి పూర్తైతే రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు. పవిత్రమైన మట్టి, జలాలను ప్రధాని మోదీ తెచ్చారని గుర్తుచేశారు. దిల్లీ కన్నా దీటైన నగరం కట్టేందుకు అండగా ఉంటామని మోదీ చెప్పారన్నారు.

కేంద్రంపై దాడి

విద్యుత్ గురించి మాట్లాడిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. వైకాపా వైఫల్యాలపై మాట్లాడితే ఆఖరికి కేంద్రంపైనా దాడికి దిగుతున్నారన్నారు. అమరావతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్న చంద్రబాబు.. సేవ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్‌ నినాదం కొనసాగాలన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ప్రకటన చేయాలన్నారు.

ఇదీ చదవండి :అమరావతి ఉద్యమం.. విధ్వంస పాలనకు వ్యతిరేకం : లోకేశ్

Last Updated : Jul 4, 2020, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details