చంద్రబాబుపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నందమూరి బాలకృష్ణ(Nandamuri balakrishna Strong Counter To YCP Leaders news). అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలను తనదైనశైలిలో దుయ్యబట్టారు. భువనేశ్వరిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అలా మాట్లాడం చాలా దురదృష్టకరమన్నారు. వాళ్ల ఆంగికం, ఆహార్యం, వాచకం చూస్తే.. అసెంబ్లీలో ఉన్నామా..? గొడ్ల చావిడిలో ఉన్నామా అన్నట్లు ఉందంటూ ఘాటుగా స్పందించారు. సమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో ఇలా మహిళలను వ్యక్తిగతంగా కించపరచటం ఏమాత్రం సరికాదన్నారు.
'రాష్ట్రాభివృద్ధికి వైకాపా వాళ్లు చేసేదేం లేదు.. దోచుకోవటం తప్ప. భువనేశ్వరి అనేక సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అసలు వాళ్ల నీచమైన భాష చూస్తుంటే అసహ్యం వేస్తోంది. మాకే కాదు.. వాళ్ల ఇళ్లల్లో ఉండే ఆడవాళ్లు కూడా అసహ్యించుకుంటున్నారు. కొన్నింటిని పక్కదోవ పట్టించేందుకు ఇలా నీచంగా మాట్లాడుతున్నారు. హుందాగా ఉండటం నేర్చుకోవాలి. అలాగే సభలోని స్పీకర్.. ఏం చేస్తున్నారో అర్థంకావటం లేదు. ప్రభుత్వ పక్షపాతిగా వ్యవహారిస్తున్నారు. ఈ సమావేశాల్లోనే కాదు.. గత సమావేశాల్లోనూ అలాగే చేశారు' - నందమూరి బాలకృష్ణ
ఇలాగే మాట్లాడితే తాము చేతులు ముడ్చుకుని కూర్చోబోమని బాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రతి అంశాన్నీ పక్కదోవ పట్టించటం మానుకోవాలన్నారు. వాళ్లు మారకపోతే మెడలు వంచి మార్చుతామని హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసుపై కూడా దాడికి దిగారు. ఆ సమయంలోనే మాట్లాడుదామని అనుకున్నప్పటికీ.. చంద్రబాబు సూచన మేరకు స్పందించలేదన్నారు. ఇక నిన్న జరిగిన పరిణామాలను ఉపేక్షించేది లేదనే.. ముందుకు వచ్చామని బాలకృష్ణ చెప్పారు. ఆడవాళ్లపై మాట్లాడి.. మైండ్ గేమ్ ఆడాలని చూడటం మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తే సహించబోమని.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. అధికారం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.